మాదాపూర్, మే 17: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు కొండాపూర్ కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి కాపాడారు. మియాపూర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళకు గొంతు వద్ద థైరాయిడ్ వాపు కారణంగా.. గుండెను, ఊపిరితిత్తులను, ప్రధాన రక్తనాళాలను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుండటంతో ఇబ్బంది పడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. ఆమెకు కిమ్స్ వైద్యులు చికిత్స చేసి నయం చేశారు. ఈ సందర్భంగా థోరాసిక్ సర్జన్, డాక్టర్ సీ రోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 35 ఏళ్ల వయసున్న ఆ మహిళ ఊపిరి అందక ఇబ్బంది పడుతూ ముందుగా వేరే దవాఖానకు వెళ్లగా అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు ఎదలో కుడివైపుపై భాగంలో ఒక భారీ కణతి కనిపించింది. బయాప్సీ పరీక్షలో భారీ థైరాయిడ్ కణంలా అనిపించడంతో ఆమెను కొండాపూర్‌లోని కిమ్స్ దవాఖానాకు పంపించారు. దీంతో అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు చాలా కాలం నుంచి థైరాయిడ్ వాపు సమస్య ఉందని, క్రమంగా మెడ నుంచి కిందికి వెళ్లి ఎదభాగాన్ని ఆక్రమించిందని తెలిసింది.
ఆమె కుడివైపు ఊపిరితిత్తులు, గుండె, ప్రధాన రక్త నాళం.. ఇవన్నీ క్రమంగా వ్యాపిస్తూ రెట్రో స్టెర్నల్ గాయిటర్‌గా రూపొందింది. పెద్ద శస్త్ర చికిత్స చేయాలని చెప్పగా దాదాపు 15 సెంటీమీటర్ల పొడవున్న కణతి, కుడివైపు పై ఊపిరితిత్తిని, గుండెను, ఒక ప్రధాన నరాన్ని బాగా నొక్కి పట్టినట్లు గుర్తించాము. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, నైపుణ్యంతో ఆ కణితిని జాగ్రత్తగా తొలగించాం. దీంతో ఆమెకు రక్తప్రసరణ మొత్తం సాధారణ స్థితికి చేరుకుంది. శస్త్ర చికిత్స అనంతరం ఆమె కోలుకోవడంతో వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ రోహన్ రెడ్డి తెలిపారు. శస్త్ర చికిత్సలో ఇంకా ఎండోక్రైన్ సర్జన్ డాక్టర్ రమ్య వలివేరు, గుండె నిపుణులు డాక్టర్ నిసర్గ, డాక్టర్ వినీత్, వ్యాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వెంకటేశ్ బొల్లినేని తదితరులు భాగమయ్యారు.