గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 24, 2020 , 01:05:53

భయం వద్దు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

భయం వద్దు.. నిర్లక్ష్యం చేయొద్దు..!

ఎప్పుడు పోతుందో.. అంచనా వేయలేం..!

వ్యాక్సిన్‌ వచ్చేవరకు అప్రమత్తంగా ఉండండి..!

సామూహిక కార్యక్రమాలకు..మరో నాలుగు నెలలు దూరంగా ఉండాలి

గ్రేటర్‌లో కొనసాగుతున్న కరోనా కేసులు

వ్యాక్సిన్‌ వచ్చేవరకు నిబంధనలు పాటించాల్సిందే

కరోనా వైరస్‌ విస్తరిస్తూనే ఉన్నది. గ్రేటర్‌లో ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల లాక్‌డౌన్‌ పూర్తిస్థాయిలో సడలించడంలో రోడ్లపై జనసంచారం పెరిగిపోయింది. ఎవరిలో వైరస్‌ ఉన్నదో తెలియక గుంపులుగా తిరుగుతుండటంతో కరోనా చాపకింది నీరులా పాకుతూనే ఉన్నది. వైరస్‌ ఎప్పుడు పోతుందో అంచనా వేయలేమని.. వ్యాక్సిన్‌ వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో పీక్‌స్టేజికి వచ్చే అవకాశం ఉన్నందున మరో నాలుగునెలలు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి. చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలుపుతున్నారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌లో కరోనా కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉన్నది. మందులేని కరోనా మహమ్మారి ఇప్పుడే పోయే పరిస్థితి లేదు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు పూర్తి అప్రమత్తతతో మెలగాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నమోదవుతున్న కేసుల్లో సింహభాగం ఎలాంటి లక్షణాలు లేకుండా ఎసింప్టమాటిక్‌గా నమోదవుతున్నాయి. ఈ ఎసింప్టమాటిక్‌ కేసుల వల్ల ఎవరిలో వైరస్‌ ఉందో తెలియకపోవడం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. నమోదవుతున్న కేసుల్లో 80శాతానికి పైగా ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటున్నప్పటికీ 20శాతం కేసులు తీవ్రలక్షణాలకు గురవ్వడం, అందులో 5శాతం కేసులు ఐసీయూ, వెంటిలెటర్‌ వరకు వెళ్లడం జరుగుతుందని, 1శాతంలోపు మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యనిపుణులు తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారే అధికశాతం తీవ్ర లక్షణాలకు గురై దవాఖానల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని, మరికొందరు మధ్య వయస్కుల్లో ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ వైరస్‌ రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

చలికాలంలో మరోసారి విజృంభణ

సాధారణంగా చలికాలం వైరస్‌లకు అనుకూలమైనదని వైద్యనిపుణులు తెలిపారు. ఈ క్రమంలో రాబోయే చలికాలంలో వైరస్‌ మరోసారి పీక్‌స్టేజ్‌కి చేరుకునే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ స్వభావంపై ఖచ్చితమైన స్పష్టత లేకపోవడం వల్ల వైరస్‌ను ఎవరూ సరిగ్గా అంచనా వేసే పరిస్థితి లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాంధీ వైద్యులు సూచిస్తున్నారు. ముఖానికి మాస్క్‌, చేతులకు శానిటైజర్‌ తప్పనిసరని, అనవసర ప్రయాణాలను విరమించుకోవాలని, అవసరమైన పనులుంటేనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. మరో నాలుగు నెలల వరకు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండటమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. 

భయాందోళన, నిర్లక్ష్యం తగదు 

కరోనాపై భయాందోళన చెందాల్సిన పనిలేదని అదే సమయంలో నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌కు మందులేదు, నివారణ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ప్రజలు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రతిరోజు ఉదయం లేదా సాయంకాలం వ్యాయామం చేయాలని, అన్నింటికంటే ముఖ్యమైనది మానసిక దైర్ఘ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని ఏచిన్న అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.


డిసెంబర్‌ వరకు చెప్పలేం....

వైరస్‌ స్వభావంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. వైరస్‌లో పరివర్తనాలు జరుగుతున్నాయి. అవి రోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది పరిశోధనల్లో తేలాల్సి ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కేసులు మాత్రం అదే స్థాయిలో నమోదవుతున్నాయి. చలికాలంలో వైరస్‌ తీవ్రతలో పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చు. కాని కేసులు మాత్రం నమోదయ్యే అవకాశాలున్నాయి. సాధారణంగా చలికాలం అనేది వైరస్‌లకు అనుకూలమైన కాలం. అందువల్ల ప్రజలు జాగ్రతగా మెలగడం మంచిది. కేసుల తగ్గుదలపై డిసెంబర్‌ వరకు ఏమీ చెప్పలేం. ఇదే స్థాయిలో కేసులు నమోదు కావచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. 2021లోనే కేసుల హెచ్చుతగ్గులపై ఒక అంచనాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్‌ ఇప్పుడే మన మధ్యనుంచి పూర్తిగా పోదు. కొంత కాలం ప్రజలు కరోనా నియమాలు పాటిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ సంవత్సరం చివరి వరకు ప్రస్తుతం అవలంబిస్తున్న కరోనా నియమాలే పాటించాలి. 

- డాక్టర్‌ రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌

వైరస్‌ మన మధ్యనే ఉంది

వైరస్‌ ఇంకా మన మధ్యనే ఉంది. కేసుల సంఖ్య పక్కన పెడితే వైరస్‌ తీవ్రత కొంత తగ్గిందని చెప్పవచ్చు. రోగం వచ్చిన తరువాత బాధపడటం కంటే రాకముందు జాగ్రతగా ఉండడం మంచిది. అన్‌లాక్‌ నుంచి ప్రజల్లో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. అనవసరంగా బయటకు వెళ్లడం మానుకోవాలి. అత్యవసరమైతేనే వెళ్లడం ఉత్తమం. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మరికొంత కాలం వాయిదా వేసుకోవాలి. కొంత మందిలో యాంటిబాడీస్‌ సరిగా ఫామ్‌ కావడంలేదు. దీని వల్ల వారికి రెండోసారి కూడా వైరస్‌ సోకుతున్నట్లు కైంప్లెంట్స్‌ వస్తున్నాయి. ఈ తరహాలో ఉస్మానియా దవాఖానలో ఇద్దరు వైద్యులకు రెండవ సారి పాజిటివ్‌ వచ్చింది. కరోనా అనేది అంటువ్యాధి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆఖరి కేసు వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే. మొన్నటి వరకు ఎంత నిబద్ధతతో ఉన్నారో దాన్నే మరికొంత కాలం కొనసాగించాలి. మాస్కు లేనిదే గడప దాటొద్దు. బయట వస్తువులను టచ్‌ చేస్తే వెంటనే చేతులను శానిటైజర్‌ లేదా సబ్బు నీళ్లతో కడుక్కోవాలి. సామూహిక కార్యక్రమాలు నిర్వహించడం, పాల్గొనడం మరికొంత కాలం వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం లక్షణాలు లేని కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ కేసుల వల్లనే వ్యాప్తి అధికంగా జరుగుతుంది.

- డాక్టర్‌ నాగేందర్‌, సూపరింటెండెంట్‌, ఉస్మానియా దవాఖాన

పిల్లలు,  గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి

సాధారణంగా చిన్నపిల్లలు, గర్భిణుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ. చలికాలంలో పిల్లలకు న్యుమోనియా వంటి ఇన్‌ఫెక్షన్స్‌ ఎక్కువగా వస్తుంటాయి. కొవిడ్‌ కూడా అదే జాతికి చెందిన వైరస్‌. ప్రస్తుతం కరోనా పాండమిక్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలి. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి. ఏడాదిలోపు పిల్లలకు తల్లిపాలు పట్టడం తల్లీబిడ్డకు మంచిది. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు పిల్లలు, గర్భిణులు, బాలింతలు పూర్తి అప్రమత్తతతో ఉండడం మంచిది. 

- డా.ఉషారాణి, చిన్నపిల్లల విభాగాధిపతి, నిలోఫర్‌ దవాఖానlogo