మేడ్చల్, రంగారెడ్డి, జూన్ 3(నమస్తే తెలంగాణ): మహానగర అనుబంధ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం. మేడ్చల్ జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడిన అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో వార్డులను ఖరారు చేశారు. ఎల్లంపేట, మూడుచింతపల్లి మున్సిపాలిటీల పరిధిలో 24 వార్డులు, అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల ఏర్పాటుగా గెజిట్‌ను ఎప్రిల్ 15న గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా మున్సిపాలిటీలలో వార్డు విభజను నోటిఫికేషన్‌కు ముందే అధికారులు కసరత్తు చేశారు.
మున్సిపాలిటీల్లో ఏర్పడిన గ్రామాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులను విభజించనున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో 14గ్రామాలు అలియాబాద్‌లో 6, మూడుచింతపల్లిలో 14 గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీలుగా చేసిన విషయం విదితమే. గతంలో నిజాంపేట్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, బొడుప్పల్ నాలుగు కార్పొరేషన్లు ఉండగా మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూకుంట, నాగారం, దమ్మాయిగూడ ఘట్కేసర్, కొంపల్లి, దుండిగల్, పోచారం మున్సిపాలిటీలు ఉండగా ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి నూతన మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో 16 మున్సిపాలిటీలతో మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లాగా మారినట్లయింది.
రంగారెడ్డిలో 5 మున్సిపాలిటీల్లో…
రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దఅంబర్‌పేట్, తుక్కుగూడ, శంషాబాద్ మున్సిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పాటైన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరుపనున్నారు. ప్రస్తుతం పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలో 24 వార్డులుండగా…అదనంగా మరో ఐదు గ్రామాలు కలిశాయి. దీంతో వార్డుల విభజన తప్పనిసరి అయ్యింది. అలాగే, తుక్కుగూడలో ప్రస్తుతం 16వార్డులున్నాయి. ఈ మున్సిపాలిటీల్లోనూ కొత్తగా మరో మూడు గ్రామాలను విలీనం చేశారు.
ఇక్కడ కూడా వార్డుల విభజన చేయనున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో ప్రస్తుతం 25వార్డులు ఉండగా. కొత్తగా మరో 7గ్రామాలు విలీనమయ్యాయి. ఈ మున్సిపాలిటీలోనూ వార్డుల విభజన చేస్తారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన చేవెళ్లలో ప్రస్తుతం 18 వార్డులున్నాయి. కొత్తగా మరో 12 గ్రామాలను విలీనం చేశారు. అలాగే, మొయినాబాద్ మున్సిపాలిటీలో 26వార్డులున్నాయి. కొత్తగా మరో 10 గ్రామాలను విలీనం చేశారు. దీంతో ఈ రెండు మండలాల్లో కూడా వార్డుల విభజన జరుగనుంది. వార్డుల విభజన అనంతరం ఈ రెండు మున్సిపాలిటీల్లో మరిన్ని వార్డులు పెరిగే అవకాశాలున్నాయి.