సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పోలీసు శాఖలో హోమ్‌గార్డుల పాత్ర కీలకం. ప్రతి విభాగంలో వారు లేనిదే పనులు జరగవు. దర్యాప్తు, నిఘా తదితర ప్రత్యేక విభాగాలు మినహా రోజువారి కార్యకలాపాలకు సంబంధించి హోమ్‌గార్డులు పోలీసు శాఖకు చేదోడు, వాదోడుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇంతటి ప్రాధాన్యత గత హోమ్‌గార్డుల సంక్షేమంపై పోలీసు శాఖ చిన్నచూపు చూస్తోందనడానికి రెయిన్కోర్టుల పంపిణీ కార్యక్రమమే నిదర్శనం. వానాకాలం మొత్తం గడిచిపోయిన తరువాత చివర్లో రెయిన్కోట్లు పంపిణీ చేయడంపై హోమ్‌గార్డులు పెదవి విరుస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్‌లో….
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న హోమ్‌గార్డులకు జాయింట్ సీపీ(ట్రాఫిక్) గజరావు భూపాల్ శనివారం రెయిన్కోట్లను పంపిణీ చేశారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 941మంది హోమ్‌గార్డులకు రెయిన్కోట్లను అందచేసినట్లు అధికారులు తెలిపారు. అదనపు డీసీపీ ఎస్.కె.శమీర్, హోమ్‌గార్డ్ ఇన్చార్జ్ ఆర్ఐ విజయానంద్, స్టోర్స్ ఆర్ఐ అనిల్ తదితరులు పాల్గొన్నారు.