సిటీ బ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో పెద్దాపూర్ నుంచి సింగూరు వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేస్-3 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తాగునీరు భారీ మొత్తంలో వృథాగా పోతున్నది. చుట్టుపక్కల పొలాల్లో నీరు చేరు చెరువును తలపిస్తున్నాయి. లీకేజీలు అరికట్టడానికి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయా ప్రాంతాలకు సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు తెలిపారు.
మలేషియన్ టౌన్షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, భరత్‌నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీనగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపీహెచ్బీలో కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంతభాగం, ఫతేనగర్, గోపాల్‌నగర్, హఫీజ్‌పేట సెక్షన్, మయూరినగర్, మియాపూర్ సెక్షన్, ప్రగతి నగర్ సెక్షన్, మైటాస్, బీహెచ్ఈఎల్, ఏఐజీ-1, 2, రైల్ విహార్, హెచ్‌సీయూ, చందానగర్ ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు.
జగద్గిరిగుట్ట : కుత్బుల్లాపూర్ జలమండలిలో పనిచేస్తున్న మీటర్ రీడింగ్ సిబ్బందికి జీతాలివ్వకపోవడంతో శుక్రవారం విధులు బహిష్కరించారు. ఐపీఎల్ చౌరస్తాలోని కార్యాలయంలో కేవీఎస్ కంపెనీ మీటర్ల రీడింగ్, బిల్లుల వసూలు కాంట్రాక్టు పొందింది. నాలుగు నెలలుగా 34 మందికి జీతాలు అందడంలేదు. జలమండలి కాంట్రాక్టు రెన్యూవల్ కాకపోవడంతో గుత్తేదారు కంపెనీ వారికి జీతాలివ్వడంలేదు. ఈఎస్ఐ , పీఎఫ్ కూడా చెల్లించకపోవడంతో వారు అందోళన చెందుతున్నారు.