సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో 6న జరగనున్న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనానికి విద్యుత్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ తెలిపారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జోనల్ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించిన మండపాలు, ఆ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే వీధులు, రహదారులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు.
నిమజ్జన కార్యక్రమానికి 68 ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌లు, అదనపు లోడ్లు అందుకోవడానికి 104 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, విధుల్లో 101 సబ్ డివిజన్ స్థాయి టీమ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతీసెక్షన్ పరిధిలో నిరంతరం అందుబాటులో ఉండే విధంగా షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. గ్రేటర్లో వివిధ విభాగాలైన ఆపరేషన్, లైన్స్, సీబీడీలకు చెందిన 101 సబ్ డివిజన్ స్థాయి టీమ్‌లకు తోడు ఇతర విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కూడా విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మేడ్చల్ జోన్ పరిధిలో 71 నిమజ్జన ప్రాంతాల్లో 31 కంట్రోల్ రూమ్స్, 43 డీటీఆర్లు, రంగారెడ్డి జోన్ పరిధిలోని 29 నిమజ్జన ప్రాంతాల్లో 25 కంట్రోల్ రూమ్స్, 22 డీటీఆర్లు, మెట్రో జోన్ పరిధిలో 10 నిమజ్జన ప్రాంతాల్లో 12 కంట్రోల్ రూమ్స్, 39 డీటీఆర్లు ఏర్పాటు చేశామన్నారు.
అధికారులు శోభాయాత్ర జరిగే మార్గాలను మరోసారి పరిశీలించి.. విద్యుత్ పరంగా ఎక్కడా ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకోవాలని, ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులను పర్యవేక్షించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేందుకు సంస్థ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నట్లు వెల్లడించా రు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో సంస్థ డైరెక్టర్లు శివా జీ, డా.నర్సింహులు, చక్రపాణి పాల్గొన్నారు.