రంగారెడ్డి, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చామని, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు శాఖలపై చర్చ జరిగింది. సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చిన సమస్యలను విన్న మంత్రి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎజెండా అంశాల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసినందుకు జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభనందించారు.
కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోవడంపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్‌కుమార్, కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని పలువురు సభ్యులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సాయిచంద్ మృతికి సంతాపం
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతికి సంతాపంగా జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, తెలంగాణ నిర్మాణంలోనూ గాయకుడిగా సాయిచంద్ ప్రజలను జాగృతం చేసి క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. సాయిచంద్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉన్నారు.