మేడ్చల్ రూరల్, జనవరి 28: పాఠశాలలో డిజిటల్ తరగతులలోని ఇంగ్లిష్ బోధన విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలని, పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. ముందుగా పాఠశాలలోని డిజిటల్ తరగతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సిలబస్ విషయాన్ని అడిగి తెలుసుకుని, మధ్యాహ్న భోజనాన్ని ఎలా అందిస్తున్నారని ఆడిగారు. కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఇంగ్లిష్ పాఠాన్ని తెలుగులో చెప్పమని కలెక్టర్ అడుగగా విద్యార్థులు మంచిగా చదివి వినిపించినందుకు సంతోషించిన కలెక్టర్ వారికి పెన్నులను బహూకరించారు.
నూతన్‌కల్ పల్లె దవాఖాన పరిశీలన..
శ్రీరంగవరం నుంచి పక్కనే ఉన్న నూతన్‌కల్ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి స్థానిక పల్లె దవాఖానను సందర్శించారు. పల్లె దవాఖాన సేవలను పేద ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని ఈ సందర్భంగా వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట డీఈవో విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి రఘునాథ స్వామి, జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత, తహసీల్దార్ శైలజ, ఎంపీడీవో వసంత లక్ష్మి, జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ పాల్గొన్నారు.