సిటీబ్యూరో: ‘మియాపూర్‌లో నివాసం ఉండే రఘుబాబు ఐదేళ్ల కిందట పటాన్‌చెరూ సమీపంలో 242 గజాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అవగాహన రాహిత్యంతో ఎల్ఆర్ఎస్ సమయంలో వ్యక్తిగతంగా దరఖాస్తు చేయలేదు. తాజాగా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినా ఏ అధికారిని కలవాలో తెలియక… హెచ్ఎండీఏ టోల్ ఫ్రీ నంబర్‌ను ఆశ్రయించే ప్రయత్నం చేశారు. అయితే ఉదయం నుంచి టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రయత్నిస్తున్నా.. ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదని వాపోయాడు.
’ లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీంతో ఇలా ఇబ్బందులు పడుతున్న వారెందరో.. ఇప్పటికే అస్పష్టమైన విధానాలు, పాలనపరమైన సందేహాలతో ఆ ప్రక్రియనే గందరగోళంగా మారిన నేపథ్యంలో… దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసే వేదిక లేక తలలు పట్టుకుంటున్నారు. మార్చి 31లోపే 25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ చెల్లించే వెసులుబాటు కల్పించినా ప్రభుత్వం… అందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టలేకపోయింది.
హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 8లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, దరఖాస్తుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 1800599838 ఎల్ఆర్ఎస్ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 500కు పైగా కాల్స్ రావడంతో సిబ్బంది కూడా చేతులెత్తివేసేలా పరిస్థితి మారింది.కాగా రాష్ట్రంలో 25.60 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకుంటే వారిలో ఇప్పటి వరకు కేవలం 15000 మంది మాత్రమే ఫీజులు చెల్లించినట్లు సంబంధిత అధికార వర్గాల వారు ధ్రువీకరిస్తున్నారు.