కవాడిగూడ, మే 8: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కొంటోందని వ్యవసాయ ఆర్థిక నిపుణులు డీ పాపారావు అన్నారు. మోదీ రైతులకు ఇచ్చిన హామీల అమలు, సీఎం రేవంత్రెడ్డి రైతులకు ఇచ్చిన గ్యారెంటీల అమలు, రైతు పండించిన పంటలకన్నింటికీ స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా సమగ్ర పంటలు ఖర్చు ప్రాతిపదికన కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని, కనీస మద్దతు ధరల కేంద్ర చట్టం సాధనకై అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ ఆర్థిక నిపుణులు పాపారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకొని రైతు అనుకూల విధానాలు అమలు చేయకపోతే దేశానికి ఆహార భద్రత ఉండదన్నారు. రైతాంగ రుణాలన్నీ రద్దుచేసి జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని ఉపసంహరించాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టం-2006ను చిత్తశుద్దితో అమలు చేయడం లేదని, సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉప్పల ప్రభాకర్ మాట్లాడుతూ.. స్వామినాథన్ సిఫార్సుల మేరకు సమగ్ర ఖర్చుల మీద 50 శాతం లాభం కలిపి ధరలు నిర్ణయించాలన్నారు. అప్పుడే రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, ఉపాధ్యక్షుడు డి.రాము, సహాయ కార్యదర్శి నందిరామయ్య, చంద్రన్న, దేవరాం, భిక్షమన్న, యాదగిరి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.