ఖైరతాబాద్, మే 13 : ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల కేటాయింపులపై తీవ్ర వివాదం నెలకొంది. అసలైన పేదలకు కాకుండా ఆర్థికంగా బలమైన వారికి, స్థానికేతరులకు ఇండ్లు కేటాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇంటి కోసం ఎమ్మెల్యే, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగిన లబ్ధిదారులు నిరసన బాట పట్టారు. బుధవారం ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాల సముదాయం ఎదుట తమ ఇండ్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కలెక్టర్, రెవెన్యూ అధికారుల తీరుపై దుమ్మెత్తిపోశారు. డబుల్ బెడ్రూం కోసం స్వచ్ఛందంగా ఇండ్లు ఇచ్చిన తమకు కాకుండా ఎమ్మెల్యే దానం తన అనుచరులకు కేటాయించారని ఆరోపించారు. తమకు ఇండ్లు ఇవ్వని పక్షంలో ఆ గృహాల తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ తమకు నిలువ నీడలేకుండా చేసిందంటూ శాపనార్థాలు పెట్టారు. తమ ఇండ్లను తమకే కేటాయించే వరకు వదిలేదన్నారు.
2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ క్వార్టర్స్ స్థానంలో డబుల్ బెడ్రూం గృహా లు నిర్మించాలని సంకల్పించారు. రూ. 17.85 కోట్ల వ్యయంతో గృహా నిర్మాణాలు ప్రారంభించి.. నాలుగు బ్లాకుల్లో 210 డబుల్ బెడ్రూం గృహాలు నిర్మించారు. 2022 ఫిబ్రవరి 3న అప్పటి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గృహాల సముదాయంలో ప్రజల సమక్షంలో 202 మంది లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. మిగిలిన ఎనిమిది మంది లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి అర్హులైన వారికి అందజేస్తామని అప్పటి కలెక్టర్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.
అప్పటికే అనేక మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, ఇండ్లు కోల్పోయిన వారికి ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో అధికారులు లబ్ధిదారుల ఎంపికను వాయిదా వేస్తూ వచ్చారు. ఏడాది తర్వాత 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికార బదిలీ కావడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. అయితే అప్పటికే ఖైరతాబాద్‌లో ఇండ్లు కోల్పోయిన లబ్ధిదారులకు ఇంటి అర్హత స్లిప్పులు సైతం అందజేశారు. తాజాగా సోషియో ఎకానామిక్ సర్వే సైతం నిర్వహించి ఏడుగురు ఇండ్లు కోల్పోయిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలు కేటాయింపునకు ఖైరతాబాద్ తహసీల్దార్ పేరిట సిఫారసు లేఖ నం. బీ2/654/ 2025ను సైతం విడుదల చేశారు.
అక్రమంగా గృహాలను కేటాయించారంటూ ఆరోపణ
ఇదిలా ఉండగా అన్ని అర్హతలుండి అధికారికంగా రావాల్సిన తమ ఇండ్లను అక్రమంగా ఎమ్మెల్యే తన అనచరులకు సంబంధించిన వారికి అక్రమంగా కేటాయించారని లబ్ధిదారులు ఆరోపించారు. దొడ్డిదారిన మూడో కంటికి తెలియకుండా అధికార పార్టీ మంత్రి క్యాంపు కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు అందజేశారని ధ్వజమెత్తారు. ఆ ఇండ్లను దక్కించుకున్న వారందరూ ఆర్థికంగా ఉన్నవారేనని, స్థానికేతరులని, వారి ఆర్థిక స్థితిగతులపై న్యాయ విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయంటున్నారు. అవసరమైతే న్యా యపరంగా తమ ఇండ్ల కోసం పోరాడుతామని తేల్చిచెప్పారు.
మా ఇంటిని మరొకరికి కేటాయించారు : శ్రీలత, లబ్ధిదారు
ఖైరతాబాద్‌లో డబుల్ బెడ్రూం గృహాలు నిర్మిస్తున్న క్రమంలో దారి మధ్యలో మా ఇండ్లు ఉన్నాయి. అధికారుల విజ్ఞప్తి మేరకు స్వచ్ఛందంగా మేము ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న ఇండ్లను ఇచ్చేశాం. అయితే మొదట ఇండ్లు కోల్పోయిన లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాత మాకు ఇస్తామని అధికారులు నమ్మబలికారు. కానీ ఇప్పటి వరకు ఇల్లు కేటాయించకపోగా, మేము నివాసం ఉండాల్సిన ఇంటిని మరొకరికి కేటాయించారు. ఉన్న నీడను కోల్పోయి కుటుంబంతో సహా కిరాయి ఇంటిలో నివాసం ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాం.
అర్హత ఉన్నా..ఇల్లు ఇవ్వలే
డబుల్ బెడ్రూం గృహాల లబ్ధిదారుల జాబితాలో తమకు కేటాయించినట్లు అధికారులు లేఖ ఇచ్చారు. అందుకు గాను కేటాయింపు పత్రం సైతం అందజేశారు. ఎలాగో మాకు డబుల్ బెడ్రూం కేటాయించారన్న నమ్మకంతో ఉన్నాం. కానీ అధికారులపై పెట్టుకున్న నమ్మకం వమ్ముగా మారింది. మాకు అప్పగించాల్సిన డబుల్ బెడ్రూం ఇంటిని అనర్హులకు కేటాయించారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే ఇప్పుడు ఇండ్లు లేవంటూ బుకాయిస్తున్నారు.
– సంధ్యా, లబ్ధిదారు
కిరాయి ఇల్లే దిక్కయ్యింది
రెండున్నర సంవత్సరాలుగా ప్రస్తు త ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటితో పాటు తహసీల్దార్ కార్యాలయం చు ట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం దక్కలేదు. మా అమ్మ యాదమ్మ పేరిట వచ్చిన డబుల్ బెడ్రూం ఇంటిని ఇందిరానగర్ క్వార్టర్స్‌తో సంబంధం లేని వారికి కేటాయించారు. ఉన్న ఇంటిని కోల్పోయిన మా కుటుంబానికి కిరా యి ఇల్లే దిక్కకైంది.
– రమేశ్, లబ్ధిదారుడు