GHMC | సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి డంప్ చేస్తున్న వాహనాల నుంచి రాంకీ ఏజెన్సీ వసూలు చేస్తున్న అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. నూతన భవనాల నిర్మాణం, పాత నిర్మాణాలను కూలగొట్టినప్పుడు వస్తున్న బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ (మట్టి)ని సేకరించి తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు సుమారు 200 వరకు ఉన్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ తెలిపారు.
జీహెచ్ఎంసీ సూచించిన స్థలా ల్లో డంప్ చేస్తున్నామని, మొదట్లో ఒక వాహనం నుంచి బల్దియా రూ. 100 వసూలు చేసిందని, జీహెచ్ఎంసీతో రాంకీ ఒప్పందం జరిగిన తర్వాత రూ. 350 పెంచారని చెప్పారు. రాంకీ సంస్థ అకస్మాత్తుగా ఈ నెల 1 నుంచి వా హనం లెక్క కాకుండా టన్నుకు రూ. 409 నిర్ణయం తీసుకున్నదని, ఒక వాహనంలో మూడు టన్నుల మట్టి పడుతుందన్నారు. రాంకీ చేసిన ఈ నిర్ణయంతో ఒక ట్రిప్పుకు రూ. 1,227 చెల్లించాల్సి వస్తున్నదన్నారు.
ఒక వాహనం పై ఓనర్ కం డ్రైవర్, ముగ్గురు లేబర్ జీవనోపాధి పొందుతున్నారని, రాంకీ నిర్ణయంతో కార్మికుల భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. రాంకీ సంస్థ వసూలు చేస్తున్న అదనపు చార్జీలను రద్దు చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, రాములు, మహేందర్, సోమయ్య, బాలయ్య , రమేశ్ తదితరులు పాల్గొన్నారు.