హయత్నగర్, జూలై 31 :నిందితులకు పోలీసులే సహకరిస్తున్నారంటూ.. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. హయత్నగర్ డివిజన్ బంజారాకాలనీలో బాలింత రమావత్ సుజా త అలియాస్ దివ్య(21) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే ఆమె భర్త శివ నాయక్, అత్త దశమి, మామయ్య పాపయ్యనాయక్, మరో ముగ్గురు కలిసి దివ్యను అదనంగా వరకట్నం తీసుకురావాలని వేధించేవారని, ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, నిందితులకు స్థానిక పోలీసులే సహకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు.
పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా, అనంతరం విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు మహిళా పోలీసు సిబ్బంది గాయపడ్డారు.
‘నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. దివ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించాం. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టాం’. అని హయత్నగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.