Hyderabad | సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేవతలారా.. మేము చేస్తున్న దొంగతనాల్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు దొరకాలి.. అంటూ తమ దేవతలకు మొక్కుకొని ఈ ముఠాలు దొంగతనానికి బయలుదేరుతాయి. భారీ సొత్తు దొరికితే మొక్కులు తీర్చుకుంటారు. ఇలా మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ గ్యాంగ్ తమ స్టయిల్లో దొంగతనాలకు పాల్పడుతూ సైబరాబాద్ పోలీసులకు చిక్కింది.
ఈ అంతర్రాష్ట్ర ముఠాలకు సంబంధించిన వివరాలను మంగళవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీలు శ్రీనివాస్, నర్సింహా వెల్లడించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన కరన్ మనోహర్ బాబర్, ప్యార్ సింగ్ బావుల, ధేబ్రా బావుల పాత నేరస్థులు. ఈ ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, కడక్ సింగ్, థాకూర్ ఇద్య, కుమన్ ఇద్యను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో ముఠాలో ఆరుగురు సభ్యులుంటారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా.. ఆయా ముఠాలోని మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ముఠాలు దొంగిలించిన సొత్తును కొంటున్న రిసీవర్లు రోహిత్ సోని, గౌరవ్ కూడా పరారీలోనే ఉన్నారు.
36 కేసులను ఛేదించిన పోలీసులు
ఈ ముఠాల్లోని నేరగాళ్లందరూ పాత నేరస్థులే. వీరిపై తెలంగాణతో పాటు ఆయా రాష్ర్టాలలో కేసులు ఉన్నాయి. దొంగతనాలకు వెళ్లడానికి ముందు తమ కుల దేవతలను మొక్కి.. నేరాల బాటపడుతారు. పగటి పూట రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని అర్ధరాత్రి తరువాతే నేరాలు చేస్తారు. ఆశించిన మేరకు సొత్తు దొరకగానే స్వగ్రామానికి వెళ్లిపోతారు. పారిపోయేందుకు కనిపించిన బైక్‌లను ఎత్తుకెళ్తారు. ఈ ముఠా 2020 నుంచి 2024 వరకు ట్రై పోలీస్ కమిషనరేట్లు, చుట్టుపక్కల జిల్లాల్లో 36 దొంగతనాలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు ముఠాల నుంచి ఆరుగురిని అరెస్ట్ చేసి, సొత్తు రికవరీ చేశారు.