సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 ( నమస్తే తెలంగాణ )/బడంగ్‌పేట: నగరంలో 17న జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. బాలాపూర్ విఘ్నేశ్వరుడిని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, నగర సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, శశాంక్, రాచకొండ సీపీ సుధీర్‌బాబులతో కలిసి ఆయన దర్శించుకున్నారు.
అనంతరం నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, లాల్‌దర్వాజ, చార్మినార్, ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్ వరకు రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో 25వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఏర్పాట్లు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను కంట్రోల్ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. నిమజ్జన యాత్ర కొనసాగే ప్రతీ మార్గంలో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగుతాయన్నారు. ఇందుకోసం 15 వేల సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు. గతేడాది కంటే ఈసారి 15 శాతం విగ్రహాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇందుకు అనుగుణంగానే ఏర్పాట్లు, అదనంగా క్రేన్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో 15వేల మంది సిటీ పోలీసులు, 10వేల మంది జిల్లాల నుంచి పోలీసులను రప్పిస్తున్నట్లు నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈనెల 17న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు దినానికి బదులుగా నవంబర్ 9( రెండో శనివారం)న పనిదినంగా ప్రభుత్వం పేర్కొంది. అలాగే తెలంగాణ హైకోర్టు పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డితో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, జ్యుడీషియల్ అకాడమీ, రాష్ట్ర లీగల్ సర్వీసు అథారిటీ, హైదరాబాద్ జ్యుడీషియరీ సంస్థలకు గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో 17న సెలవు దినంగా ప్రకటిస్తూ.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.