Keesara | కీసర, ఫిబ్రవరి 27 : కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శంభో శంకర హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా శివభక్తులతో మార్మోగింది. శివరాత్రి వేడుకలకు వచ్చిన భక్తులు కీసరగుట్టలోనే జాగరణ చేసి ఒక్కపొద్దును ఖజ్జురతో విడిచి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న భక్తులు నేరుగా కాశీవిశ్వేశ్వరాలయం, శ్రీ లక్ష్మినర్సింహస్వామి, శ్రీ నాగదేవత అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకు ముందు స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కల్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకార హోమం, ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం వంటి ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ఆలయ కార్యనిర్వహాణాధికారి కట్టా సుధాకర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా అయిదవ రోజు ఈనెల 28వ తేదీ శుక్రవారం స్వామివారికి ఉదయం 5.30 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కల్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, సాయంత్రం 7గంటల నుంచి ప్రదోషకాల పూజ, హారతి, మంత్ర పుష్పం, రాత్రి 8 గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం వంటి పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు.