సిటీబ్యూరో, మే 30(నమస్తే తెలంగాణ): 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో పురోగతి లేకుండా పోయింది. అట్టహాసంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే ఆ విభాగం కుంటుపడింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయక, కొత్త ప్రాజెక్టులను చేపట్టక ప్రణాళికలను సాగదీస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అధునాతన ప్రతిపాదనలు, అంతకు మించిన ప్రణాళికలను రూపొందించాల్సిన హెచ్ఎండీఏ చేతులెత్తేసింది. కనీసం గతంలో రూపొందించిన రూ.5వేల కోట్ల ప్రతిపాదనలకైనా కార్యరూపంలో తీసుకురావడానికి వెనుకడుగు వేస్తున్నది.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధి ఇటీవల 11 జిల్లాలకు విస్తరించింది. దాదాపు కొత్తగా ప్రతిపాదించిన రీజినల్ రింగు రోడ్డు వరకు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలను హెచ్ఎండీఏలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కానీ, గడిచిన ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ఈ విభాగం చేపట్టింది లేదు.
రేవంత్ రెడ్డి సీఎం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆరేడు నెలలు కొత్త ప్రాజెక్టులకు మాత్రం శంకుస్థాపన చేశారు గానీ, ఇప్పటివరకు ఆ ప్రాజెక్టులలో తట్టెడు మట్టిని తీసింది లేదు. దీంతో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన హెచ్ఎండీఏలో అభివృద్ధి పనులు లేకుండా పోయాయి. పాత ప్రాజెక్టులకు పూతలు వేసినట్లుగా, మరమ్మతులు, నిర్వహణలకు మాత్రమే కోట్ల రూపాయలను వెచ్చిస్తుందే తప్పా… కొత్తగా, నగరాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను పట్టాలెక్కించడంలో వెనుకబడిపోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు గత పదేండ్లలో బీఆర్ఎస్ వినూత్న రీతిలో ప్రణాళికలను అమలు చేసింది. పెరుగుతున్న పరిధికి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి పట్టణాభివృద్ధిని వ్యూహాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో సుందరీకరణ, లింకు రోడ్ల నిర్మాణం, అంతర్జాతీయ స్థాయిలో పార్కులు, అర్బన్ ఫారెస్ట్రీ, భవన నిర్మాణ అనుమతులతో సంస్కరణలను అభివృద్ధిలో నగరాన్ని పరుగులు పెట్టించింది.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఏడాదిన్నర కాలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారి, ప్రతిపాదన దశలో ఉన్న ఎన్నో ప్రాజెక్టులకు మార్పులు, చేర్పులతో సర్దుబాటు చేస్తున్నది. ప్రాజెక్టులు ఏవైనా ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయే తప్పా.. ఇప్పటికీ ఇంచు పురోగతి లేకుండా పోయింది. ఇలా మహానగరంలో అభివృద్ధి కుంటుపడుతున్నది. ఇతర మెట్రో నగరాలకు గట్టి పోటీనిచ్చే హైదరాబాద్ నగరంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక వెలవెలబోతున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు రూ. 5వేల కోట్లతో అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఎన్నికల కారణంగా పక్కన పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికలను పక్కన పెట్టి… కొత్త ప్రాజెక్టుల పేరిట హడావుడి చేస్తుందే తప్పా పనులు చేపట్టడం లేదు. అలా హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారితే… రోడ్డుకు అడ్డుగా ఉందని నేలకూల్చిన సైకిల్ ట్రాక్ పునర్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కొత్వాల్గూడ్లో చేపట్టిన ఏకోపార్క్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇలా వరల్డ్ క్లాస్ మౌలిక వసతుల నిర్మాణంలో తలమునకలయ్యే హెచ్ఎండీఏ ఉత్సాహం నీరుగారిపోతూనే ఉన్నది.