వెంగళరావునగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపెడుతుందని పేర్కొన్నారు.
గురువారం సోమాజిగూడ డివిజన్..వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో రూ.13 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనవాస్ తో కలిసి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు మహిళలకు ఎంతగానో ఉపకరిస్తున్నాయని అన్నారు.
పేదింటి అమ్మాయిలకు ఘనంగా పెండ్లి చేసి అత్తారింటికి కేసీఆర్ సాగనంపుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టింటి వారి బాధ్యతలాగా ఈ బృహత్ కార్యక్రమాన్ని తన భుజాన వేసుకున్నారని ఆయన కొనియాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో లబ్దిపొందిన మహిళలతో త్వరలోనే సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు.
అనంతరం ఎల్లారెడ్డిగూడలో హైటెన్షన్ వైర్లతో విద్యుత్ఘాతానికి గురైన మనీల అనే మహిళ ఇంటికి జూబ్లీహల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ వెళ్లి ప్రమాదం జరిగిన తీరు తెలుసుకున్నారు. త్వరలోనే హైటెన్షన్ వైర్ల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అప్పు ఖాన్, తన్ను ఖాన్, శరత్ గౌడ్, నాగమణి, వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి రవీందర్, రమణారావు, రవీంద్రనాథ్, ప్రభాకర్, అను, తదితరులు పాల్గొన్నారు.