జూబ్లీహిల్స్/ వెంగళ్రావునగర్, సెప్టెంబర్ 27ః జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఖంగు తినే తీర్పును చూడబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీలకు కేసీఆర్ కొండంత అండగా ఉన్నారని.. డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవులతో వారిని గౌరవించారని కేటీఆర్ తెలిపారు. శనివారం రహ్మత్‌నగర్ డివిజన్ గంగానగర్‌లో ప్రముఖ ఇస్లాం పండితుడు అహ్మద్ నక్ష బందీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సమావేశలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ ఖంగుతినే తీర్పునివ్వాలని.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రానుందన్న నిజాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా తీర్పు ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలు ఎంత నష్టపోయారో వారికి తెలుసని.. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఛైర్మన్ మసిఉల్లాఖాన్, బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఆజం అలీ, బద్రుద్దీన్, సున్నీ ముస్లిం మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.