సికింద్రాబాద్ : ప్రజల ఆశ్వీరాదం నిరంతరం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.
నియోజకవర్గంలోని మారేడ్‌పల్లి కోర్టు లైన్లో సుమారు రూ.91లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్ నిర్మాణంతో పాటు రసూల్‌పురాలోని 105 గల్లీలో సుమారు రూ.15లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ త్వరలోనే నారాయణ జోపిడి సంఘం బస్తీలో డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి నాయకుడు, అధికారి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు నళినికిరణ్, ప్రభాకర్, నేతలు నివేదితా, టీఎన్ శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, గౌస్, వాహెబ్, నయీమ్, నర్సింహ్మా, అంజనేయులు, శ్రీను, నగేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.