బన్సీలాల్‌పేట్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువస్తాయని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav ) అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు ఎం.సురేశ్ (అంబులెన్స్) ఆధ్వర్యంలో బన్సీలాల్‌పేట్ డివిజన్, పద్మారావునగర్‌లోని హమాలిబస్తీకి చెందిన 70 మంది యువకులు బీఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలకు మేలు చేస్తున్న తమ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు. పేదింటి ఆడపడుచు వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం, వితంతు, వృద్ధులు, దివ్యాంగులకు నెలనెలా ఫించన్ (Pensions) అందిస్తున్నారని తెలిపారు.
రైతు బంధు, రైతు బీమా, దళితుల అభ్యున్నతికి దళితబంధు (Dalit Bandu) పథకం ద్వారా పది లక్షల ఆర్థిక సహాయం, వివాహాల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం, నగరంలో 24 గంటల పాటు కరెంట్ సరఫరా, ఉచితంగా తాగునీరు అందించడం లాంటివి అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామని అన్నారు.
బస్తీ ప్రజల కోసం సకల సదుపాయాలతో రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి, లాటరీ పద్దతిలో అందించిన ఘనత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, బీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జి పవన్‌కుమార్ గౌడ్, నాయకులు ఏసూరి మహేశ్, వెంకటేశన్ రాజు, కె.లక్ష్మిపతి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్, శివ, వినోద్, సన్ని, శ్రీకాంత్, జిలానీలు పాల్గొన్నారు.