బడంగ్‌పేట, మార్చి 5 : అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంగిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నడుస్తుండగా కాంగ్రెస్ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆ పార్టీ నాయకుల ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన ప్లెక్సీలు, హోర్డింగ్‌లను పెట్టకుండా అడ్డుకుంటున్న అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతల ప్లెక్సీలపై స్పందించడం లేదని మండిపడుతున్నారు.
ఈ విషయమై మంగళవారం కలెక్టర్ సీరియస్ అయ్యారు. అయినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోక పోవడంపై వివిధ పార్టీల నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల ప్లెక్సీలు తొలగించకపోతే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.