మంచిర్యాల, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. బీఆర్ఎస్కు పూర్తిస్థాయి కోరం ఉన్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ బరితెగింది. ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలపై దాడులకు తెగబడింది. నిర్బంధాలకు ఎదురొడ్డి కౌన్సిల్లోకి బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లు వెళ్లగా, అక్కడా హస్తం నేతలు అరాచకా లు సాగించారు. మంత్రి వివేక్ ముందే మద్యం మత్తులో కౌన్సిలర్లతో అసభ్యంగా ప్ర వర్తించారు. ఓ వైపు పోలీసుల లాఠీచార్జ్‌లు, కాంగ్రెస్ మూకలు రాళ్లదాడితో విరుచుకుపడడంతో క్యాతనపల్లి రణరంగంగా మారింది. రెండో రోజూ సైతం అధికారం అండతో చైర్మ న్, వైస్‌చైర్మన్ ఎన్నికను మరోసారి వాయిదా వేయించింది.
క్యాతనపల్లి మున్సిపల్లో ఓటింగ్ సందర్భంగా మంగళవారం కౌన్సిల్‌కు వెళ్లేందుకు బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ముం దస్తు అనుమతి తీసుకొని మూడు వాహనాల్లో బయల్దేరగా క్యాతనపల్లి ఫైఓవర్ ప్రారంభంలోనే పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కౌన్సిలర్లకే అనుమతి ఉందని చెప్పడంతో వాగ్వా దం జరిగింది. పోలీసుల సూచించినట్టే కౌన్సిలర్లు మాత్రమే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో 21వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతపై మిస్సింగ్ కేసు ఉన్నదని ఆమె వెళ్లేందుకు వీల్లేదంటూ పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. రోడ్డుపైనే ఆపి ఆమెను విచారించా రు. తనను ఎవరూ బలవంతం చేయలేదని, ఇష్టపూర్వకంగానే బీఆర్ఎస్తో ఉన్నానని స్వర్ణలత కరాఖండిగా తేల్చిచెప్పారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్, సీపీఐ నాయకుల నిరసనకు దిగడంతో ఎట్టకేలకు కౌన్సిలర్ స్వర్ణలతను బైక్‌పై కౌన్సిల్‌కు తీసుకెళ్లారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్‌తో పాటు ఏడు, ఎనిమిది వాహనాల్లో కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చారు. తమను అనుమతించనప్పుడు కాంగ్రెస్ వాళ్లను కూడా అనుమతించేందుకు వీల్లేదని, వందలాది మందిని ఎలా పంపుతారంటూ బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వందల మంది కాంగ్రెస్ లీడర్లు, బీఆర్ఎస్ నాయకులపై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టారు.
ప్రమాణ స్వీకారం పూర్తికాగానే కాంగ్రెస్ నాయకులు కావాలనే గొడవకు దిగారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడికి యత్నించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా కౌన్సిల్ లోపల ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీ ముందే కాంగ్రెస్ కౌన్సిలర్లు సహా ఇండిపెండెంట్ కౌన్సిలర్ మద్యం మత్తులో బీఆర్ఎస్-సీపీఐ మహిళా కౌన్సిలర్లతో వెకిలిచేష్టలు చేస్తుంటే వేడుక చూ శారే తప్ప పట్టించుకోలేదంటూ వారు విలపి స్తూ చెప్పారు. ఎంఆర్వో పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలా మారి తలుపులు వేసేందుకు ప్ర యత్నించగా, తామంతా వెళ్లి అడ్డుకున్నామంటూ మహిళా కౌన్సిలర్లు భోరున విలపించారు. ప్రమాణ స్వీకార అనంతరం గొడవ జరుగుతుండగానే మంత్రి వివేక్, ఎంపీ వంశీ అక్కడినుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీనికి నిరసనగా మూడు గంటల పాటు బీఆర్ఎస్-సీపీఐ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం లోపలే బైఠాయించి నిరసన తెలిపారు.
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతనపల్లిలో ఎన్నికల విధుల్లో ఉన్న తమపై దాడి చేసి విధులను ఆటంకం కలిగించాలని దేవాపూర్ ఎస్ఐ గంగారాం మంగళవారం రాత్రి రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఓటు వినియోగించుకునేందుకు వెళ్తున్న సమయంలో బాల్క సు మన్, మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేశ్, అనిల్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్‌రెడ్డి మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు బండ రాళ్లతో కొట్టడంతో కోటపల్లి ఎస్సై రాజశేఖర్ చేతి వేళ్లకు, కానిస్టేబుల్ రాకేశ్ తలకు తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. ఈమేరకు సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
క్యాతనపల్లిలో మంత్రి వివేక్ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో పూర్తిస్థాయి కోరం ఉన్నా.. కలెక్టర్‌ను, స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న ఎంఆర్వోను, పోలీసులను చేతుల్లో పె ట్టుకొని చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికను వాయి దా వేయించాడంటూ నిప్పులు చెరిగారు. క్యాతనపల్లిలో మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడా రు. సోమవారం కావాలనే ఎన్నికను అడ్డుకొని వాయిదా వేయించిన మంత్రి వివేక్.. ఆయన పదవి ఊడిపోతుందన్న భయంతో బలవంతంగా మున్సిపల్ కౌన్సిల్‌ను సొంతం చేసుకునేందుకు దౌర్జన్యాలకు తెరలేపాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్యం తాగి వచ్చి మంత్రి వివేక్, ఎంపీ వంశీ ముందే బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చోద్యం చూసిన వివేక్‌కు సిగ్గుందా అని ప్రశ్నించారు. కలెక్టర్ సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు శంకర్ పాల్గొన్నారు.
క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్లో ఆడబిడ్డలపై మీద కాంగ్రెస్ దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్‌కు సుమన్ పిలుపునిచ్చారు.
‘కౌన్సిల్లో కాంగ్రెస్ లీడర్లు మాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలకు దండం పెట్టాం. కాపాడాలని బతిలాడాం.. ఎంపీఆర్వోకు చెప్పాం. పోలీసోళ్లను వేడుకున్నాం. అందరూ కూర్చొని వేడుక చూశారు. రేపు పోలింగ్ పెట్టినా ఇదే జరగదని గ్యారంటీ ఏంటో చెప్పాలి. రేపు ఎన్నిక లైవ్‌లో జరిగితేనే మేం వెళ్తాం’ అంటూ మహిళా కౌన్సిలర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.

రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 17 : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులకు మంగళవారం మధ్యాహ్నం మున్సిపాలిటీ చెత్త వాహనంలో భోజన ప్యాకెట్లను తీసుకొచ్చారు. చెత్త సేకరించే వాహనంలో ఇలా భోజనం తేవడంపై వారు అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల అధికారుల నిర్వాకాన్ని బహిరంగంగానే విమర్శించారు. భోజనాలు తీసుకొచ్చేందుకు వేరే వాహనాలు లేవా అని మండిపడ్డారు.