గత ఏడాది ‘తండేల్’ సినిమాతో తొలిసారి వందకోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యారు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం ఆయన ఫాంటసీ థ్రిల్లర్ ‘వృషకర్మ’లో నటిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత చైతూ సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు తరుణ్‌భాస్కర్‌తో చైతూ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గత కొన్నేళ్లుగా దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్నారు తరుణ్‌భాస్కర్. ప్రస్తుతం ఆయన ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు-2’ ఐడియా కూడా ఉందని అంటున్నారు.
ఈలోగా చైతూతో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట తరుణ్‌భాస్కర్. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని తెలిసింది. ‘ఈ నగరానికి ఏమైంది-2’ పూర్తయిన వెంటనే నాగచైతన్య సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. మరోవైపు సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు తర్వాత అగ్ర నటుడు నాగార్జున-దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా చైతూ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం.