జూబ్లీహిల్స్, ఏప్రిల్ 11: రహమత్ నగర్ డివిజన్ ఎస్పీ ఆర్ హిల్స్‌లోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ భవనాన్ని శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14 న ఈ ప్రతిష్టాత్మక భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించి పనుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా స్టడీ సర్కిల్లోని అన్ని అంతస్తులను అడుగడుగునా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయే విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. ఉన్నత ఉద్యోగాలకు సిద్ధపడే అభ్యర్థులకు ఈ దళిత్ స్టడీ సర్కిల్ ఎంతగానో ఉపాయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీడీఎస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.