Innovation Marathon | సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ అధికారులు స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి శుక్రవారం తెలిపారు. ఇన్నోవేషన్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నీతి అయోగ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, యూనిసెఫ్, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇన్నోవేషన్ విభాగం ఏఐసీటీఈ సహకారంతో ఈ కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు.
ఆసక్తిగల విద్యార్థులు https://schoolinno vationmarathon.org/లో వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు. ఇందులోనే వారి ఐడియాను పేర్కోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోరుతూ ఏదైనా సమస్యను పేర్కొని దానికి పరిష్కారం చూపే ప్రాజెక్టు రూపొందించాలన్నారు. ఇలా వచ్చిన ప్రాజెక్టులను పరిశీలించి వచ్చే జనవరిలో వెయ్యి మంది విజేతలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ పోటీలో ప్రతీ రాష్ట్రం నుంచి 30 బృందాలను విజేతలుగా ప్రకటిస్తారని వెల్లడించారు.
విజేతలు జూలై 29న దేశవ్యాప్తంగా నిర్వహించే అతి పెద్ద ఇన్నోవేషన్ పోటీలో పాల్గొంటారని చెప్పారు. స్కూల్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్స్ విద్యార్థులను సంసిద్ధం చేయాలని సూచించారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సమాచారం కోసం 7799 1712 77 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవాలని, దరఖాస్తుకు శనివారంతో ఆఖరు అని పేర్కొన్నారు.