హైదరాబాద్: హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నగరంలో వర్షం కురిసింది. రోజంతా మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీగా మంచు (Dense Fog) కురుస్తున్నది. దట్టంగా మంచు అలుముకున్నన్నది. ఉదయం 8 గంటలు అయితే మంచు తెరలు వీడకపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ముందు వెళ్తున్న వెహికల్స్ కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని జర్నీ చేస్తున్నారు.
కాగా, రాష్ట్రంలో ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వానకాలంలో ఎండలు దంచికొట్టగా.. చలికాలంలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణమని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉదయం హైదరాబాద్లో వర్షం కురిసింది. ఈ నెల 14,15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో 16,17తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు.