Viral Fevers | సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో వైరల్ ఫీవర్స్ గ్రేటర్‌ను చుట్టుముట్టాయి. వర్షం కారణంగా దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరో పక్కన జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పుల వంటి లక్షణాలతో వైరల్ ఫీవర్స్ జనాలను వణికిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. నగరంలోని దవాఖానలన్నీ జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. బస్తీ దవాఖానలు సైతం సీజనల్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోజవారి ఓపీ 800 నుంచి 1500 దాటుతున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో సైతం రోజు వారి ఓపీ 3000 దాటుతున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. ప్రధానంగా వైరల్ ఫీవర్స్, డెంగీ తదితర జ్వరాలకు సంబంధించిన జనరల్ మెడిసిన్ ఓపీ రోజువారి కంటే రెండు మూడు రెట్లు అధికంగా నమోదవుతున్నట్లు దవాఖానల అధికారులు చెబుతున్నారు. డెంగీ, మలేరియా, చికున్ గున్య వంటి విషజ్వరాల బాధితులను పక్కన పెడితే వైరల్ ఫీవర్స్ కేసులు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వైరల్ ఫీవర్స్ ఒకరి నుంచి మరొక్కరికి సోకుతుండటంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఒక్కరికి వస్తే చాలు, ఇతర కుటుంబ సభ్యుంలందరూ వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ఈ వైరల్ ఫీవర్స్ ఒకరి నుంచి మరొక్కరికి వ్యాపిస్తున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. దీంతో పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో కూడా రోజు వారి ఓపీ 500 దాటుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పలు దవాఖానల్లో వైద్య సిబ్బంది సైతం వైరల్ ఫీవర్స్‌కు గురవుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, వైరల్ ఫీవర్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు వైద్యులు. మూడు నుంచి ఐదు రోజుల్లో వైరల్ ఫీవర్స్ తగ్గిపోతాయని, అప్పటికీ తగ్గకపోతే తదుపరి వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల పట్ల ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని, సకాలంలో చికిత్స తీసుకుంటే మంచిదని సూచిసున్నారు.