బంజారాహిల్స్, ఆగస్టు 19: జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం నిర్లక్ష్యం ఒకవైపు, జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం రెండోవైపు. వీటికి తోడు ఎంటమాలజీ విభాగం నిర్వాకం తోడవడంతో నగరంపై డెంగీ పంజా విసిరింది. పదిరోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదు కావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో తీవ్రమైన జ్వరాలతో చేరిన వారిలో గత 10 రోజుల్లో 22 మందికి డెంగీ వ్యాధి నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.
బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని మంత్రుల నివాసాల ఎదురుగా శారదా ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న ఓ వైద్యుడికి వారం రోజుల కిందట డెంగీ వ్యాధి నిర్ధారణ అయింది. ఎన్బీటీనగర్కు అత్యంత సమీపంలో ఉండే ఈ అపార్ట్మెంట్లో డెంగీ కేసు నమోదు కావడంపై వైద్యశాఖ అధికారులు పరిశీలన నిర్వహించగా, సమీపంలోని ఖాళీ స్థలంలో భారీ నీటి గుంతలో విపరీతంగా దోమలు ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. దీనికి తోడు ఎన్బీటీనగర్లోని మల్టీ పర్పస్ కమ్యూనిటీహాల్ ఎదురుగా పదిరోజుల నుంచి సీవరేజ్ పొంగుతోందని, అక్కడే చెత్తను వేస్తుండడంతో దోమలు విజృంభిస్తూ విషజ్వరాల బారిన పడుతున్నారని అధికారులు గుర్తించారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉంటున్న వృద్ధురాలికి తాజాగా డెంగీ వ్యాధి నిర్ధారణ అయిందని తేలింది. ఆమె జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి చేరి చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖ అధికారులకు సమాచారం అందింది. మూసాపేట, ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, శ్రీరాంనగర్ తదితర ప్రాంతాల్లో సైతం పదుల సంఖ్యలో విషజ్వరాల బారిన పడ్డారని తెలుస్తోంది. డెంగీ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా వైద్యశాఖ సిబ్బంది స్థానికంగా ఉండే ఎంటమాలజీ విభాగం అధికారులతో కలిసి దోమల నివారణ కోసం చర్యలు చేపట్టింది.
అయితే ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోవడం, పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పొంగుతూ రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దోమల విజృంబణను అరికట్టడం కష్టంగా ఉందని ఎంటమాలజీ విభాగం సిబ్బంది సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది డెంగీ కేసులు నమోదయిన ప్రాంతాలను గుర్తించడంతో పాటు దోమలు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు నిద్రమత్తులో ఉండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డెంగీ ముప్పు పొంచి ఉందని, తక్షణమే అన్ని ప్రభుత్వ విభాగాలు యుద్ధ ప్రాతిపదికన డెంగీ నివారణ చర్యల్లో పాల్గొనకపోతే పెను ప్రమాదం తప్పదని వైద్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.