Musi | మూసీ రణరంగాన్ని తలపిస్తున్నది. ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొన్నది. ఏండ్ల తరబడి అక్కడ బతుకుతున్న వారి ఇండ్లను కూల్చేసి రేవంత్ సర్కార్ దమనకాండకు తెరతీసింది. ఇప్పటికే 150 ఇండ్లు నేలమట్టమయ్యాయి. మరో 940 గృహాలపై రెడ్ మార్క్ వేలాడుతున్నది. ఎటు నుంచి జేసీబీలు, బుల్డోజర్లు వస్తాయోనని నిర్వాసితులు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు అధికారులు కూల్చేసిన గృహాల శిథిలాలను తరలించాల్సి ఉన్నది. అందుకోసం జేసీబీలను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు.
నేడు అవి హిమాయత్‌నగర్, సైదాబాద్ మూసీ పరీవాహక ప్రాంతాల్లోకి దూసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. అయితే హిమాయత్‌నగర్, సైదాబాద్‌లో కూల్చేసిన నిర్మాణాల వరకు జేసీబీలు వెళ్లే రోడ్లు లేవు. ఇరుకు రహదారులతో ఆ ప్రాంతాలు ఉన్నాయి. రెడ్ మార్క్ నిరాకరించిన ఇండ్లను సైతం కూలగొట్టినా.. జేసీబీలు అక్కడి వరకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా.. అడ్డుకునేందుకు నిర్వాసితులు సిద్ధమవుతుండటంతో పరీవాహక ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశమున్నది. అయితే అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రజల కంట పడకుండా జేసీబీలను అక్కడికి తరలించేందుకు రహస్యదారులను అన్వేషించినట్టు సమాచారం.
-సిటీబ్యూరో
రహస్యదారుల అన్వేషణ
హిమాయత్‌నగర్, సైదాబాద్‌లో కూల్చేసిన నిర్మాణాల శిథిలాలు తరలించేందుకు అధికారులు రహస్యదారులను పరిశీలిస్తున్నారు. జేసీబీలను ప్రజలు అడ్డుకోకుండా త్వరగా శిథిల ప్రాంతాలకు వెళ్లేలా ప్రణాళికలు వేస్తున్నారు. అందుకోసం మూడు మార్గాలను అధికారులు ఎంచుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగా ఎంజీ బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ మూసీ మార్గాన్ని పరిశీలించినట్టు తెలిసింది. మరో మార్గం పురానాపూల్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంతో మూసీ వెంట రూట్‌ను కూడా పరిశీలించినట్లు సమాచారం. మూసారంబాగ్ నుంచి అంబర్‌పేట బ్రిడ్జి మీదుగా సదరు లొకేషన్‌కు చేరుకునే మార్గాన్ని కూడా చర్చించుకున్నట్టు తెలిసింది. ఈ మార్గాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులు చర్చలు జరిపినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌కు మనసు లేదు
మాకు ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు. మా ఇల్లును కూల్చేశారు. మమ్మల్ని బెదిరించి కూల్చారు. మా బతుకును నాశనం చేశారు. రేవంత్ సర్కార్‌కు మా కన్నీటి గోస తగులుతుంది. మేం అనుభవిస్తున్న కష్టానికి వంద రెట్లు అధికంగా గోసపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి మనసులేని సీఎం ను మేం ఏనాడూ చూడలేదు.
-ఫాతిమా, మూసానగర్.
జేసీబీ ప్రవేశిస్తే..
మూసీ పరీవాహక ప్రాంతంలో కూల్చివేతలు 50 మంది లేబర్లతో జరిగాయి. 150 నిర్మాణాలు భూస్థాపితమయ్యాయి. ఆ శిథిలాలను తరలించాలనే నెపంతో జేసీబీలను అధిక సంఖ్యలో అక్కడికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి అవి అక్కడికి వెళితే శిథిలాల తొలగింపుతో పాటు రెడ్ మార్క్ చేసిన ఇతర నిర్మాణాలను సైతం కూల్చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. అయితే ఇది అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పటికే కొందరిని ఒప్పించి డబుల్ బెడ్రూం అందించడానికి నిర్ణయించామని.. వారి అంగీకారంతో మిగిలిన నిర్మాణాలు కూల్చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు తమ ఇండ్లను బలవంతంగా, బెదిరిస్తూ కూల్చేస్తున్నారని నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసుల బెదిరింపులతో ఖాళీ చేయాల్సిన దుస్థితి వస్తున్నదని రమ్య, ఫాతిమా అనే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
మీరేం బాగుపడుతారు..
మూసీలో ఏండ్ల తరబడి ఉంటున్నాం. మా ఇండ్లను కూల్చితే మీకేం వస్తుంది. మా బతుకులు నాశనం చేసి కట్టే భవంతులు, నిర్మాణాలు మీకు మేలు చేయవు. మేము ఇష్టపూర్వకంగా వెళుతున్నామని అధికారులు చెబుతున్నారు. అది అబద్ధం. మమ్మల్ని బెదిరించి పంపడానికి చూస్తున్నారు. నిర్మాణాలు కూల్చడానికి ఏ మిషన్లు వచ్చినా.. అడ్డుకుంటాం. మా ఇండ్లు కూల్చి మీరేం బాగుపడుతారు.
-చాంద్‌బీ, శంకర్‌నగర్.