(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): జీ-20 సమావేశాల కోసం దేశ రాజధాని ఢిల్లీని ముస్తాబు చేస్తున్నామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం పేదలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నది. కీలక భవనాలు, రోడ్లను విద్యుత్తు కాంతులతో మెరిసేలా చేస్తున్నామని చెబుతూ.. పేదల బతుకులను చీకట్లతో నింపుతున్నది. సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న వీవీఐపీల భద్రత పేరిట యాచకులు, చిరు వ్యాపారులను రోడ్లపై కనిపించకుండా చేస్తున్నది. ఢిల్లీ నగర ముస్తాబు.. అక్కడ నివసించే సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నది. మురికివాడల్లో నివసించే వేలాది మంది సామాన్యులకు నిలువనీడ లేకుండా చేశాయి. పేదరికం నిర్మూలిస్తానంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్రమోదీ.. ప్రపంచ దేశాల్లో తన ప్రతిష్టను పెంచుకునేందుకు మురికివాడల్లో జీవితాలు వెళ్లదీస్తున్న వందలాది కుటుంబాలను నిరాశ్రయులను చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీ అతిథులకు పేదరికాన్ని కనిపించకుండా చేయడానికి మురికివాడల్లోని ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఇండ్లే కాదు.. రోడ్డు పక్కన ఉన్న బడ్డీ కొట్లు, టైర్ పంచర్ షాపులతో పాటు ఇతరత్రా చిరు వ్యాపారస్థులను తొలగించేశారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచకులు, ఆట బొమ్మలు, దస్తీలు, సాక్సులు అమ్ముకునే వారిని నగరంలో కనిపించకుండా దూరంగా పంపించివేశారు.
రోడ్లకు ఇరువైపులా సుందరీకరణ పేరిట గ్రీన్ మ్యాట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వందలాది మంది బతుకులు ఛిద్రమయ్యాయని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం ఢిల్లీలోని నాలుగు ప్రధాన మురికివాడల్లో 4125 ఇళ్ల యజమానులకు నోటీసులిచ్చి, ఇప్పటివరకు 2,325 ఇండ్లు కూల్చి వేశారు. దీంతో 2.65 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఢిల్లీలోని అతిపెద్ద స్లమ్‌లలో ఒకటైన తుగ్లకాబాద్‌లో వెయ్యి ఇండ్లను కూల్చి వేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నా, అనధికారికంగా 3 వేలకు పైగా ఇండ్లు కూల్చినట్టు తెలుస్తున్నది. దౌలకువాన్, జహంగీర్‌పురి వంటి మరో 12 మురికివాడల్లో కూడా నోటీసులు ఇచ్చారని, ఇండ్లు కూల్చివేతలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. మరో వైపు మురికివాడల్లోని కూల్చివేతలు జీ-20 సమావేశాల కోసం కాదంటూ పీఐబీ ఈ వార్తలను కొట్టివేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. కాని వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి ప్రపంచ దేశాల అగ్రనేతలు హాజరవుతుండటంతో జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో కీలక ఒప్పందాలు జరుగుతాయని కేంద్రంలోని బీజేపీ నేతలు ఊదరగొడుతున్నా, తాజాగా బ్రిటన్, అమెరికా అధ్యక్షుల వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో భారత్‌తో వెంటనే వాణిజ్య ఒప్పందాలు జరిగే అవకాశాలు లేవన్నారు.