సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): టెక్మహేంద్రలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ డిగ్రీ విద్యార్థికి సైబర్‌నేరగాళ్లు రూ.2.6 లక్షలు బురిడీ కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే .. గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీకి చెందిన బాధితుడు డిగ్రీ చదువుతూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ..తన బయోడేటాను జాబ్‌పోర్టల్స్‌లో అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాధితుడికి ఫోన్ వచ్చింది.
తన పేరు పోలవరపు సురేశ్ అని చెప్పి టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం ఉందని, నెలకు రూ.35వేల వరకు జీతం అని నమ్మించాడు. మూడు రో జుల్లో ఆఫర్ లెటర్ ఇప్పిస్తానని, అయితే కొంత ఖర్చవుతుందంటూ చెప్పాడు. దానికి సరేనంటూ బాధితుడు చెప్పగా ఆధార్‌కార్డు, బయోడేటాతో పాటు రూ.25 వేలు అడ్వాన్స్‌గా పంపాలని, ఆఫర్ లెటర్ వచ్చిన తరువాత మరో రూ.25 వేలు ఇవ్వాలని షరత్ పెట్టాడు.
దీంతో ఆ విద్యార్థి.. రూ. 25 వేలు చెల్లించిన తరువాత.. మొత్తం డబ్బులిస్తేనే ఆఫర్ లెటర్ ఇస్తారంటూ చెప్పగా రూ. 50 వేలు ఇచ్చాడు. ఆ తరువాత మరిన్ని డబ్బులు కావాలంటూ దఫ దఫాలుగా రూ. 2.6 లక్షలు వసూలు చేశాడు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.