గ్రేటర్ హైదరాబాద్‌లో సాధారణంగా రెండు సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రహదారులపై భారీగా నీరు నిలుస్తుంది..141 నీటి నిల్వ ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించింది.. వర్షాలు పడిన సందర్భంలో ఈ ప్రాంతాలపై మాన్సూన్ యాక్షన్ బృందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సహాయక చర్యలు వేగం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత శుక్రవారం కురిసిన వర్షంతో కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై భారీగా వరద నీరు చేరింది.
దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమే అన్నది సుస్పష్టం.. మంగళవారం జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్ శాఖ అధికారుల సంయుక్త తనిఖీల్లో ఇదే తేల్చారు. ఫ్లై ఓవర్ నుంచి వరద నీరు కిందికి వెళ్లే మార్గాలు పూర్తిగా సిల్ట్, చెత్తతో మూసుకుపోవడం వల్లనే నీరు నిలిచిపోయిందని పేర్కొన్నారు.. కొత్తగూడ ఫ్లై ఓవర్ డిజైన్ లోపమే అన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఫ్లై ఓవర్‌పై గ్రిల్స్‌ను శుభ్రంగా చేసి వరద నీరు దిగువకు వెళ్లేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా 47 ప్రాజెక్టుల్లో దాదాపు 37 ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకురాగా ఇందులో 23 ఫ్లై ఓవర్లు ఉన్నాయి. ఎక్కువ శాతం శేరిలింగంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్లో అత్యధికంగా ఉన్నాయి. ఐతే ప్రాజెక్టు విభాగం ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టి నిర్వహణ బాధ్యతలను మెయింటనెన్స్ విభాగాన్ని అప్పజెబుతూ వస్తున్నది. నిర్వహణలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు ఫ్లై ఓవర్లపై స్వీపింగ్ మిషిన్లతో పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నారు. ఆరు జోన్లలో 525 భాగాల్లో 811.96 కిలోమీటర్ల మేరలో రూ.1839 కోట్లతో సీఆర్ఎంపీ ప్రాజెక్టు కింద ప్రైవేట్ ఏజెన్సీలు ఐదేళ్ల పాటు నిర్వహణ చేపట్టగా, గత డిసెంబర్లో గడువు ముగిసింది.
ఇదే క్రమంలో ఏజెన్సీలతో పాటు ఫ్లై ఓవర్లపై పారిశుధ్య నిర్వహణ జీహెచ్ఎంసీ చేపడుతుండగా, 38 స్వీపింగ్ మిషిన్లతో ప్రధాన రహదారులతో పాటు ఫ్లై ఓవర్లపై ఎలాంటి చెత్త, ఇతర వ్యర్థాలు లేకుండా చూస్తుండగా, గత నెల 30 స్వీపింగ్ మిషిన్ల టెండర్ గడువు ముగియడం, రెన్యువల్ చేయకపోవడంతో పారిశుధ్య నిర్వహణ అటకెక్కింది. మాన్సూన్ యాక్షన్ బృందాలు ఫ్లై ఓవర్లపై దృష్టి సారించకపోవడం, సరైన స్వీపింగ్ వ్యవస్థ లేదు. ఫ్లై ఓవర్‌పై చెత్తా చెదారం, కవర్లు, బీర్ బాటిళ్లు, కర్రలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వంతెనలపై పేరుకుపోయాయి. ఫలితమే కొత్తగూడ ఫ్లై ఓవర్ నీట మునగడానికి కారణమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
నీరు నిల్వకుండా ఏం చేస్తారంటే..
ఫ్లై ఓవర్ల నుంచి వరద నీరు కిందికి వెళ్లేలా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తారు. వాటిలోకి వర్షపు నీరు చేరేలా పైన క్యాచ్పిట్ల తరహాలో గ్రిల్స్ ఉంటాయి. గత శుక్రవారం భారీ వర్షం కురవడంతో ఫ్లై ఓవర్లపై ఉన్న వ్యర్థాలు గ్రిల్స్ వద్దకు చేరుకున్నాయి. దీంతో వరద నీరు కిందకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై భారీగా వరద నీరు నిలవడానికి ఇది కూడా కారణమని అధికారులు చెబుతున్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్ ఘటనతో ఎట్టకేలకు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మెయింటనెన్స్ సీఈ సహదేవ్ రత్నాకర్ పర్యవేక్షణలో అన్ని పనులు చేపడుతున్నారు.