సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌ను వికేంద్రీకరణ చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. అందులో ఎన్నో మతలబులున్నాయంటూ నగర వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నీ జీహెచ్ఎంసీలో ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చారు, పోలీసు కమిషనరేట్లను పునర్విభజన చేశారు. మున్ముందు మూడు కార్పొరేషన్లు చేస్తారని.. అలాగే మూడు జిల్లాలు చేస్తారనే చర్చ నడుస్తున్నది. అదే నిజమైతే జీహెచ్ఎంసీ తిరిగి మూడు జిల్లాలుగా, మూడు కార్పొరేషన్లు విభజన జరిగే అవకాశాలున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్, పోలీస్ కమిషనరేట్ల పునర్విభజన పారదర్శకంగా జరుగలేదని ప్రతిపక్ష పార్టీలతో పాటు సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభాతో పాటు ఆయా ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండడం, సరైన సిబ్బంది ఇతరాత్ర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వికేంద్రీకరణ చేయాలి. జీహెచ్ఎంసీని ఒకే గొడుకు కిందకు తెచ్చినప్పుడు పోలీసు విభాగాన్ని కూడా ఒకే గొడుకు కిందకు తీసుకొస్తే బాగుండేదనే వాదన సైతం సిబ్బంది, ప్రజలలో చర్చ జరుగుతున్నది. అలా చేయడంతో మూడు కమిషనరేట్ల పరిధిలో ఒకే తరహా సేవలు ప్రజలకు అందే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ఓఆర్ఆర్ వరకు విస్తరించి అన్ని విభాగాలను పునర్విభజన చేసే సమయంలో అన్ని అంశాలపై ఎంతో కసరత్తు చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. అఘమేఘాలపై నిర్ణయాలు తీసుకొని చకచకా జీవోలు, నోటిఫికేషన్లు ఇవ్వడంపై నగర వాసులు చర్చించుకుంటున్నారు.
భవిష్యత్‌లో పోలీస్ కమిషనరేట్ల ఆధారంగా జిల్లాలు, కార్పొరేషన్ల విభజన జరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతున్నది. జీహెచ్ఎంసీ వార్డు పునర్విభజన సక్రమంగా జరుగలేదని హైదరాబాద్ పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో గతంలో ఉండే పాత డివిజన్లనే విడగొట్టి రెండు మూడు డివిజన్లు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క అధికార వికేంద్రకరణ అంటూ చెబుతూ మరో పక్క రాజకీయంగా హైదరాబాద్‌ను పంచుకునే కుట్ర జరుగుతుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.