ప్రజలే కేంద్రంగా.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనం వార్డు కార్యాలయ వ్యవస్థ. పురపాలక చరిత్రలో సరికొత్త ప్రయోగంగా ఏర్పాటైన వార్డు పాలనపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. సమస్యలపై ఫిర్యాదు చేయటమే ఆలస్యం.. అధికారులు చక చకా రంగంలోకి దిగుతున్నారు. గంటల వ్యవధిలోనే సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఉన్నతాధికారులూ సమస్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన వార్డు పాలన వ్యవస్థలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, వీధిదీపాలు, టౌన్‌ప్లానింగ్, పారిశుధ్యం సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కో వార్డుకు పది మంది వివిధ విభాగాల సిబ్బంది నిరంతరం ప్రజల సేవలో నిమగ్నం కావడంతో సమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తున్నాయి. ఈ సేవలపై పౌరులు ఫిదా అవుతున్నారు. వార్డు కార్యాలయాలతో పాలన చేరువ చేసిన మంత్రి కేటీఆర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలపుతున్నారు.
సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన 150 చోట్ల వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారం లభించేలా ఈ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వార్డు అధికారులు జాబ్‌చార్టుతో పాటు పౌరుల ఫిర్యాదులను ఎంతకాలంలో పరిష్కరిస్తారో చెప్పే సిటీజన్ చార్ట్‌ని ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సేవలు అందిస్తున్నారు.
గడిచిన 11 రోజుల్లో అత్యధికంగా డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, విద్యుత్ వీధి దీపాలు, టౌన్‌ప్లానింగ్, పారిశుధ్య సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వార్డు కార్యాలయాలలో అత్యధికంగా డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, విద్యుత్ వీధి దీపాలు, టౌన్‌ప్లానింగ్, పారిశుధ్యం సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. మరికొన్ని చోట్ల కొత్త రహదారులు వేయాలని, న్యాయపరమైన అంశాల్లో ఉన్న భూ సమస్యలు, జీహెచ్ఎంసీ పరిధిలోకి కానివి, ఆర్థిక అంశాలతో ముడి పడిన అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి కేటీఆర్ ఆలోచనతో పురుడుపోసుకొని..
కాలనీలు, బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్కిల్.. జోనల్ ఆఫీస్‌లకు వెళ్లి అధికారులకు ఫిర్యాదులు చేసేవారు. ఆ సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన జరిగేది. ఈ సమస్యలను అధిగమించి ప్రజలకు సత్వర సేవలు అందించాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ఆలోచనతో పురుడుపోసుకున్న వార్డు పాలనపై ప్రజలకు అవగాహన పెరుగుతున్నది. ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారం దొరుకుతుందని ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వార్డు కార్యాలయాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాకుండా ఫిర్యాదు చేసిన పౌరుడితో ఫోన్లో మాట్లాడి పనితీరుపై ఆరా తీశారు. ఈ తరహా పర్యవేక్షణ ఉండాలని, పౌర సేవలను మరింత విస్తృతం చేయాలని, వార్డు కార్యాలయాలను క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
నగర పౌరులకు సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే
వార్డు కార్యాలయాల ద్వారా పాలన అందిస్తున్నాం. వివిధ శాఖలకు చెందిన పది మంది అధికారులను నియమించడమే కాకుండా సిటిజన్ చార్టర్‌ను ఏర్పాటు చేశాం.
రాజకీయాలకు అతీతంగా
అన్ని రకాల సహయసహకారాలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరఫున కూడా అధికారులను వార్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తాం. ఈ వ్యవస్థ విజయవంతం అయితే దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశం ఉంది.
– కల్వకుంట్ల తారక రామారావు, మున్సిపల్ శాఖ మంత్రి
కేపీహెచ్‌బీ కాలనీలో చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలను తాకుతుండటంతో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను వార్డు ఆఫీస్‌లోని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. మరుసటి రోజు విద్యుత్ శాఖ, జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రజలకు చేరవలోనే అధికారులు ఉండి సేవలందించడం ప్రజల ఆదృష్టం. వార్డు స్థాయి పాలనను తీసుకువచ్చిన మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు.
– జీ.ఎల్.ఎన్.రెడ్డి, కేపీహెచ్‌బీ కాలనీ
చరిత్రాత్మకమైన నిర్ణయం..
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలోనుంచి పుట్టిన విప్లవాత్మకమైన నిర్ణయమే వార్డు కార్యాలయ ఏర్పాటు. రోజుల తరబడి సుదూర ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, అన్నివిభాగాల అధికారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమస్యలను సత్వరం పరిష్కరిస్తున్నారు. ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. – కె.పుష్పలత, తుకారాంగేట్.
150 వార్డుల్లో..
నగరంలో ఒక వార్డు పరిధిలో ఓ మున్సిపాలిటీతో సమానమైన జనాభా ఉంటుంది. ఇంతకాలం ఒక పురపాలక సంఘానికి ఉన్నంత సిబ్బంది, ఇతర సదుపాయాలతో వార్డులో ఉండేవి కావు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు పరిపాలన సేవలు చేరువయ్యేలా మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 150 వార్డుల్లో వార్డుకు పది మంది చొప్పున 1500 మంది వివిధ విభాగాల సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి వార్డు కార్యాలయాల ద్వారా సేవలందిస్తున్నారు. ఈ సేవల పట్ల పౌరులు ఫిదా అవుతున్నారు.
Minister Ktr
నిర్ణీత కాలంలో పరిష్కరించాలి
కొత్తగా ఏర్పాటైన వార్డు ఆఫీసు కార్యాలయాల అధికారులు పబ్లిక్ గ్రీవెన్స్‌ను స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కరించేలా జోనల్ కమిషనర్లు పర్యవేక్షించాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. వార్డు కార్యాలయాల అధికారులు, ప్రజలు, కార్పొరేటర్లు సూచించిన సమస్యలపైన తక్షణమే స్పందించాలని అన్నారు. ప్రజల ముంగిటకు పౌర సేవలను తీసుకువచ్చేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. సిటిజన్ చాప్టర్ అనుసరించి వార్డు అధికారులు గడువులోగా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా కార్పొరేటర్లు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని, వార్డు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు సేవలపై అప్రమత్తంగా ఉండాలని, తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టి వార్డు పనితీరును పరిశీలిస్తానని మేయర్ చెప్పారు.
– మేయర్ విజయలక్ష్మి
ఆకస్మిక తనిఖీలు.. సేవలపై ఆరా..!
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బుధవారం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్‌కుమార్ నానల్‌నగర్ డివిజన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై ఆడ్మినిస్ట్రేటివ్ అధికారి బిందును అడిగి తెలుసుకున్నారు. వార్డు కార్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయని ఆరా తీశారు. వార్డు కార్యాలయంలో అధికారులు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కార్యాలయం వేళలను మార్చుకోవాలని, వార్డు కార్యాలయం వ్యవస్థ గురించి సామాన్య ప్రజలకు తెలిసేలా ప్రచారం నిర్వహించాలని అర్వింద్‌కుమార్ ఆదేశించారు. ఇక జోనల్ కమిషనర్లు ఆయా వార్డు కార్యాలయాల్లో పర్యటించి పౌరులతో సేవలపై ఆరా తీశారు.
అన్ని శాఖలు ఒకే చోట ఉండి
వార్డు కార్యాలయాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ సులభతరం అవుతుంది. సమస్యలు రోజుల తరబడి పెండింగ్‌లో ఉండకుండా అన్ని శాఖల అధికారులు ఒకేచోట అందుబాటులో ఉండటం ద్వారా సమస్యను త్వరగా గుర్తించడంతో పాటు పరిష్కరించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి.
– మధుగౌడ్, అడ్డగుట్ట.
ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగింపు..
మూసారాంబాగ్ డివిజన్లోని ఆగ్రా స్వీట్ హౌస్ వద్ద వాణిజ్య సముదాయాల యజమానులు ఫుట్‌పాత్‌ను ఆక్రమించి శాశ్వత ఏర్పాట్లు చేసుకున్నారు. వార్డు కార్యాలయంలో ఫిర్యాదు రావడంతో వెంటనే డీఆర్ఎఫ్ బృందంతో దారికి అడ్డంగా ఉన్నవాటిని తొలగించాం.
– డీసీ జయంత్, మలక్‌పేట
డ్రైనేజీ సమస్యకు వెంటనే పరిష్కారం..
కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్ ఎంఐజీ గృహాలలో డ్రైనేజీ సమస్య నెలకొన్నదని వార్డు ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశాను. వార్డు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జలమండలి అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. గతంలో డ్రైనేజీ సమస్య ఎదురైతే ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడానికి మూసాపేట వరకు వెళ్లాల్సి వచ్చేది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించేందుకు రెండుమూడు రోజులు పట్టేది. ప్రస్తుతం కాలనీలోని వార్డు ఆఫీస్‌లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదు రాగానే స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నారు. కొత్త తరహా పాలనతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు.
– ఎం.రాధ, కేపీహెచ్‌బీ కాలనీ, 3వ ఫేజ్
తక్షణం స్పందిస్తున్నారు..
ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన వార్డు కార్యాలయాల ద్వారా సమస్యలు సత్వరమే పరిష్కారమవుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. అన్మగల్ హయత్‌నగర్‌లో డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ నిండిపోయి మురుగునీరు ప్రవహిస్తున్నదని వార్డు కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశాం. మున్సిపల్ అధికారులు, సిబ్బందిని పంపించి వెంటనే సమస్యను పరిష్కరించారు. కాలనీల్లో సమస్యల సత్వర పరిష్కారానికి నూతనంగా వార్డు కార్యాలయాల ఏర్పాటు సంతోషకరం.
– గంగని నాగేశ్, అన్మగల్ హయత్‌నగర్
అధికారులు ఎప్పటికీ ఇలాగే పనిచేయాలి
లంగర్‌హౌస్ వార్డు కార్యాలయంలో మంచినీటి సరఫరాపై ఫిర్యాదు చేశాను. అధికారులు వెంటనే స్పందించి జలమండలి అధికారులతో చర్చించి సమస్యను సత్వరం పరిష్కరించారు. నేరుగా వార్డు కార్యాలయానికి వెళితే స్పందించిన తీరు చాలా బాగుంది. అధికారులు ఎప్పటికీ ఇలాగే పనిచేస్తే బాగుంటుంది.
– ఎం.రమేశ్, మెహిదీపట్నం
రెండు రోజుల్లో గుంతలు పూడ్చారు
హైదర్‌గూడ ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ గుంతలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బాపుఘాట్ బ్రిడ్జి నుంచి హైదర్‌గూడ వరకు రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతల కారణంగా తరచుగా ప్రమాదాలు జరిగేవి. వారం రోజుల కిందట అత్తాపూర్ డివిజన్ రాంబాగ్‌లోని వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. వెంటనే స్పందించిన అధికారులు రెండు రోజులో ్లగుంతలను పూడ్చడంతో పాటు అవసరమైన చోట బీటీ వేసి ప్యాచ్ వర్కులు చేశారు.
– శ్రీనివాస్‌గౌడ్, హైదర్‌గూడ
ఫిర్యాదు అందిన వెంటనే..
జీహెచ్ఎంసీ అధికారులు వార్డు వ్యవస్థ పెట్టినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. గతంలో సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగాల్సి వచ్చేది. ఇప్పుడు వార్డు కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరిస్తున్నారు.
-జి.విజయ్‌బాబు, టోలిచౌకి.
ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం
గిరినగర్ బస్టాప్ వద్ద ప్రధాన రోడ్డుపై చెట్ల కొమ్మల ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. తక్షణమే స్పందించిన అధికారులు సంబంధిత సిబ్బందితో వాటిని తొలగించారు. ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారం చూపారు. వార్డు కార్యాలయాల పనితీరు బాగుంది.
– వి.శ్రీనివాసులు, గిరినగర్ కాలనీ, రంగారెడ్డినగర్ డివిజన్
ప్రజలకు జవాబుదారీగా..
ప్రజలకు జవాబుదారిగా నడుచుకునేలా వార్డు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తున్నాం.
– తిప్పర్తి యాదయ్య, డీసీ, సర్కిల్-15
P