బేగంపేట్ జూన్ 29 : జూలై 13 : 14న జరగనున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను వైభవంగా నిర్వహిద్దామని..అందుకు ప్రభుత్వ అధికారులు, పార్టీలకతీతంగా నాయకులు, భక్తులు సహకరించాలని దక్కన్ మానవ సేవాసమితి సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం మహంకాళి ఆలయ ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోనాల జాతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బోనాల జాతర అధ్యక్షునిగా కలపగురి శ్యామ్ రావును ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1926లో దక్కన్ మానవ సేవా సమితి ఏర్పడిందని, ఆలయం వద్ద జంతుబలిని ఆపి గత 99 సంవత్సరాలగా సాత్విక పూజ నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారని, భక్తులు కూడా సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో కార్య నిర్వాహక అధ్యక్షులు కొంక రఘుమోహన్, ప్రధాన కార్యదర్శి అత్తిలి మల్లికార్జున గౌడ్, కార్యనిర్వాక కార్యదర్శి సి.కె నర్సింగ్ రావు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ కె.వి కమల్ కుమార్, ఫుడ్ కమిటీ కన్వీనర్, సీహెచ్ శ్రీనివాస్, కార్యదర్శి వజనాల దయానందరావు, రిసెప్షన్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్.శ్రావణ్ కుమార్, ప్రచార కమిటీ కన్వీనర్ గున్నాల రవికుమార్, కోశాధికారి గోపిశెట్టి ప్రభాకర్ తదితరులను ఎన్నుకున్నారు.