కుత్బుల్లాపూర్, డిసెంబర్ 28: ఓ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో మనోహరబాద్ గ్రామానికి చెందిన టి.ప్రభాకర్ భార్య జ్యోతికను ఈనెల 25వ తేదీన కొంపల్లిలోని సురేఖ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ ఆసుపత్రిలో వైద్యులు పట్టించుకోకపోవడంతో పురిటినొప్పులు అధికం కావడంతో నర్సులే సేవలందించారు. దీంతో సాధారణ ప్రసవం అయ్యింది.
పుట్టిన బిడ్డ వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో స్పర్శ లేకుండా పోయింది. పసిపాపను మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని మరో పిల్లల ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కోపోద్రిక్తులైన బాధితురాలి కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పసిపాప మృతి చెందిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ సురేఖ ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆస్పత్రిలో ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం బాధితులు, ఆసుపత్రి యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదరడంతో ఆందోళన విరమించారు.
ఇలాంటి ఘటనలు ఎన్నో..
కొంపల్లి, సుచిత్ర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ మధ్యకాలంలో పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినా దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై సీఐ విజయ్వర్ధన్ను వివరణ కోరగా.. తమకు బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు కోరుతున్నారు.