Kukatpally | కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో నిన్న స్వరూప అనే మహిళ మృతి చెందగా.. బుధవారం సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన బాధితులు పలువురు చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 22 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బాధితులు నిమ్స్, గాంధీలో చికిత్స పొందుతున్నారు. సీతారాం (47) ప్రాణాలు విడిచాడు. వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఉపాధి కోసం కోసం హైదరాబాద్ వచ్చి హైదర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. సీతారాం మేస్త్రీగా పని చేసుకుంటున్నాడు. బాధితులను నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పరామర్శించారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. పోలీసులు కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నగేష్, శ్రీనివాస్, శ్రీనివాస్, కుమార్, రమేశ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారణమైన ఐదు కల్లు కాంపౌండ్లను అధికారులు సీజ్ చేశారు. కల్లు కాంపౌండ్ల నిర్వాహకుల నుంచి 600 లీటర్ల కల్తీకల్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కల్తీకల్లు ఘటనపై బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో ఐదు కేసులు నమోదు చేశారు. కల్తీకల్లు నమూనాలను పోలీసులు ల్యాబ్‌కు తరలించారు. కల్తీకల్లు తాగి చనిపోయిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆసుపత్రిలో స్వరూప మృతి చెందిన విషయం తెలిసిందే. స్వరూప దహన సంస్కారాలకు కుటుంబీకులు సిద్ధమయ్యారు. అంత్యక్రియల కోసం తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆపిన పోలీసులు స్వరూప మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కల్తీకల్లు తాగి చనిపోయినట్ల తేలడంతో పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు.