నిమ్స్ దవాఖానలోని వాషరూమ్ మ్యాన్‌హోల్‌లో పసికందు మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన శిశును తెచ్చి వేశారా, లేక బతికుండగానే మ్యాన్‌హోల్‌లో వేసి చంపారా అన్న విషయం దర్యాప్తులో తేలనున్నది. ఆస్పత్రికి చెందిన సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ఖైరతాబాద్, జూలై 10: నిమ్స్ దవాఖానలో ఓ పసికందు మృతదేహం కలకలం రేపింది. ఐదు నెలల నిండని ఆ శిశు మ్యాన్‌హోల్‌లో కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చూరికి తరలించారు. పోలీసులు, నిమ్స్ సిబ్బంది కథనం ప్రకారం.. గురువారం నిమ్స్ దవాఖానలోని పాత ఓపిడి విభాగంలోని రూమ్ నం. 19 పక్కన ఉన్న వాషరూమ్లో నీళ్లు డ్రైనేజీలో కలువకుండా నిలిచిపోయాయి.
దీంతో సిబ్బంది ఓ ప్లంబర్‌ను రప్పించారు. దీంతో అతను మరుగుదొడ్డిలోని మ్యాన్‌హోల్‌లో ఏదైనా జామ్ అయి ఉంటుందని తెరిచి చూసేసరికి మృతదేహం కనిపించింది. వెంటనే సిబ్బంది యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా, పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చూరీకి తరలించారు. సుమారు మూడు నుంచి ఐదు నెలల శిశువు అయి ఉంటుందని భావిస్తున్నారు.