సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): పాత కక్షలతో ప్రత్యర్థిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేసి, ఐదుమంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ కేసు వివరాలను వెల్లడించారు. కిస్మత్పూర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇర్ఫాన్ అహ్మద్ అలియాస్ షూటర్ ఇర్ఫాన్(27) రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో పేరుమోసిన రౌడీషీటర్.
ఈ క్రమంలో పాత కక్షల కారణంగా లంగర్‌హౌజ్ పీఎస్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ ఇస్మైల్ అలియాస్ షేక్ ఇస్మైల్ ఆదిల్‌ను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం మహారాష్ట్ర నాందెడ్ నుంచి రూ.20వేలకు 5రౌండ్ల దేశీయ పిస్టోల్‌ను కొనుగోలు చేశాడు. ఆదిల్‌ను హత్య చేసేందుకు సహకరించాలని స్నేహితులైన ఎండి.ఆరిఫ్ (27), బాలాపూర్ మహ్మద్ నగర్‌కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ అక్బర్ పాషా అలియాస్ తాబెర్ అలియాస్ అబ్బు(28), డబీర్‌పురా ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ క్విజర్ యాకూబి అలియాస్ ఖజీర్(23)లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు.
దీనికి స్నేహితులు అంగీకరించారు. కుట్రను గమనించిన సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు షాహినాయిత్గంజ్ ప్రాంతంలో నిందితులను పట్టుకుని హత్య కుట్రను భగ్నం చేశారు. నిందితులను విచారించగా నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన దోపిడీకి పాల్పడింది షేక్ ఇర్ఫాన్ అహ్మద్, మహ్మద్ ఆరిఫ్‌లని తేలింది. ఈ క్రమంలో లంగర్‌హౌజ్ బాగ్దాద్ కాలనీకి చెందిన షేక్ ఇస్మైల్ అలియాస్ షెక్ ఇస్మైల్ ఆదిల్ అలియాస్ ఆదిల్(27)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి హత్యకు కుట్రపన్నిన షేక్ ఇర్ఫా న్ అహ్మద్, ఆరిఫ్, అక్బర్‌పాషా, సయిద్ అబ్దుల్ రహీమ్ క్విజర్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి దేశీయ పిస్టోల్‌తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.