Medical Shops | సిటీబ్యూరో: నగరంలోని పలు మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ‘ఇట్వేజ్-200 క్యాప్సుల్స్’ను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…‘ఇట్వేజ్-200 ఎంజీ క్యాప్సుల్స్’ను ఉత్తరాఖండ్‌లోని పంత్నాగర్లోని టీవోఎస్సీ ఇంటర్నేషనల్ ప్రై.లి. అనే ఫార్మా కంపెనీ తయారు చేస్తున్నది. వీటిని చెన్నైలోని స్కినోసియన్ అనే సంస్థ మార్కెటింగ్ చేస్తున్నది.
అయితే ఇట్వేజ్-200 ఎంజీ 10 మాత్రల ధరను రూ.247.74గా నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కినోసియన్ మార్కెటింగ్ సంస్థ 10 మాత్రలను ఎమ్మార్పీ కంటే కంటే (రూ.51.25) అధికంగా రూ. 299కి విక్రయిస్తోంది. మాత్రలపై ఇవే ధరలను ముద్రించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ఆదివారం అంబర్‌పేటలోని పలు మెడికల్ షాపులపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఇట్వేజ్-200 ఎంజీ క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.