సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్‌షాప్‌లు, క్లినిక్‌లపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.35వేల విలువ చేసే పలు రకాలు అనుమతిలేని ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…కుత్బుల్లాపూర్ డీసీఏ జోన్ పరిధిలోని వంపుగూడ బండమైసమ్మ నగర్, కాప్రా మల్కాజిగిరి -మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న క్లినిక్‌కు అనుబంధంగా ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీభవానీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ పేరుతో మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు గురువారం క్లినిక్‌తో పాటు మెడికల్ షాప్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో క్లినిక్‌లో వైద్యుడి స్థానంలో అర్హత లేని ఒక యువతి ఉన్నట్లు గుర్తించిన అధికారులు అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్షాప్లోని రూ.35వేల విలువ చేసే 76రకాల మందులను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.