సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : మందుబాబులూ .. బీ కేర్ ఫుల్.. ఇకపై ఎనీ టైమ్ ఎనీ సెంటర్ తనిఖీలు తప్పవు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పాఠశాలలకు పిల్లలను తీసుకెళ్లే బస్సు, వ్యాను, ఆటో డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్ తనిఖీల్లో గుర్తించారు. దీంతో పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులు డిసైడయ్యారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే వాహనాలను తనిఖీ చేసే క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో నెలరోజుల్లో 35 మంది డ్రైవర్లను గుర్తించారు.
ఇందులో ఓ డ్రైవర్‌కు 400 రీడింగ్ వచ్చింది. ఈ విషయాన్ని జోయల్ డేవిస్ సిటీ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎనీటైం తనిఖీలకు నిర్ణయం తీసుకున్నారు. వారంరోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో అన్ని సమయాల్లో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు రవాణాశాఖతో పాటు విద్యాశాఖకు కూడా పోలీసులు లేఖ రాశారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు తాగి నడపడం వల్ల పిల్లలు ప్రమాదంలో ఉంటున్నారని, పాఠశాలల్లో డ్రైవర్లను ఉదయం, సాయంత్రం తనిఖీలు చేసి పంపాలని పేర్కొన్నారు.
వాహనదారులు, రాత్రివేళల్లో మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందనుకుంటున్నారు కానీ.. ఇప్పుడు ప్రత్యేక తనిఖీలతో మందుబాబుల భరతం పడుతున్నారు. టెస్టులో 30 ఎంజీ కంటే ఎక్కువ ఉంటే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 30వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టగా, ఇందులో 1300 మందికి ఒక రోజు నుంచి ఇరవై రోజుల వరకు జైలుశిక్ష పడింది. మరో 4500 కేసుల్లో 2800 వరకు రిజిస్ట్రేషన్ల రద్దు కోసం పంపిస్తే అందులో 853 రద్దయ్యాయి. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే వాహనాలను ప్రధానంగా టార్గెట్ చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నామని చెబుతున్న పోలీసులు ఆ దిశగా ఉదయం, సాయంత్రం వేళల్లో తనిఖీలు ముమ్మురం చేశారు. గతవారం మింట్ కాంపౌండ్ జంక్షన్లో, ఖైరతాబాద్ జంక్షన్లో సోమవారం ట్రాఫిక్ డీసీపీ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మంచివే అయినప్పటికీ పోలీసులు చెప్పినట్లు రద్దీ లేని మార్గాల్లో కాకుండా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జరపడం వల్ల సాధారణ ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే రద్దీ లేని ప్రాంతాల్లోనే ఈ తనిఖీలు జరుగుతాయని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ మొదటి రెండు రోజుల తర్వాత నుంచి కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలు రద్దీ మార్గాల్లో జరుగుతుండడంతో సాధారణ వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదు. తనిఖీలు చేయాలని, కానీ ఆఫీస్ టైమింగ్స్, ఎమర్జెన్సీగా వెళ్లే సమయంలో ఇలా తనిఖీలు చేపట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, పోలీసులు ఆ దిశగా ఆలోచించి రద్దీలేని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు మద్యం సేవించి దొరికితే కఠిన చర్యలు తప్పవని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.