Hyderabad | సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఇంటింటి కుటుంబ సర్వేలోనే కాదు.. వివరాల డేటా ఎంట్రీ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. ఈ నెల 9వ తేదీ లోపు డేటా ఎంట్రీ పూర్తి చేసుకుని రిపోర్టు ఇవ్వాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ సర్కిళ్ల వారీగా చేపట్టాలని, డేటా నమోదు సమయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా, కోడింగ్ సరైన విధంగా ఉండేలా చూడాలని అధికారులకు కమిషనర్ సూచించారు.
అయితే నేటి వరకు కొన్ని చోట్ల వివరాలు డేటా ఎంట్రీకి నోచుకోలేదు. ఏజెన్సీలను ఖరారు చేయకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం. ఈ నేపథ్యంలోనే నిర్ణీత వ్యవధిలోపు డేటా ఎంట్రీ పూర్తి చేస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. గత నెల 6న మొదలైన సర్వేలో 95 శాతం మంది వివరాలను సేకరించారు. మిగతా 5 శాతం మందిలో కొందరు తమ సొంతూర్లలో వివరాలు ఇస్తామని, మరికొందరు వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మొత్తం గా గ్రేటర్లో 29, 58,277 కుటుంబాలుండగా, 1,47,913 మంది కుటుంబాలు వివిధ కారణాలు చెప్పి సర్వే వివరాలు ఇవ్వలేదు.