హైదరాబాద్ : దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపడంపై దృష్టి సారించింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని రంగారెడ్డి రీజయన్ నుంచి దాదాపు 3,500 ఆర్టీసీ బస్సులను దసరా స్పెషల్స్‌గా జిల్లాలకు నడిపించడానికి ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
హైదరాబాద్ సిటీలో అన్ని ప్రధాన ప్రాంతాలైనా మియాపూర్, కూకట్పల్లి, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, కోఠి వంటి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్ బస్సులు నడుపబోతున్నారు. దసరా నేపథ్యంలో సిటీ నుంచి సొంత ఊర్లకు వెళ్లడం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే ప్రయత్నాలు ప్రయాణికులు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల అంశంపై పూర్తి సమాచారం వెలువడుతుందని ఆర్టీసీ రంగారెడ్డి ప్రాంత అధికారి శ్రీధర్ తెలిపారు.