బంజారాహిల్స్, డిసెంబర్ 24: బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎట్టకేలకు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని అంగీకరించారు. బుధవారం బంజారాహిల్స్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలుస్తుందని, తాను కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ‘కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ప్రకటించారని, మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని..’ మీడియా ప్రశ్నించడంతో ఏ పార్టీలో ఉంటే ఆపార్టీ గెలుస్తుందని సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.
అయితే మరోసారి పార్టీ గురించి ప్రశ్నించగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, తిరకాసు ప్రశ్నలు వేయవద్దంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. మొత్తం మీద అనర్హత పిటిషన్ల వ్యవహారంతో స్పీకర్‌తో కలిసి దోబూచులాడుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా, ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను కాంగ్రెస్‌లో ఉన్నానంటూ బాహాటంగా ప్రకటించడంతో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.