సిటీబ్యూరో: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తీరుపై గాంధీ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఓపీ సమయం ముగిసిన తరువాత వచ్చి ఓపీలో ఎవరూ లేరని షోకాజ్ నోటీసులిస్తామంటే ఎలా…అని పలువురు వైద్యులు మంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.15గంటల సమయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా ఆయన మొదట ఓపీ విభాగాన్ని సందర్శించి, అక్కడి విభాగాలన్నీ కలియతిరిగారు. అయితే అప్పటికే ఓపీ సమయం ముగియడంతో అక్కడ రోగులు పెద్దగా లేరు. సిబ్బంది భోజనానికి వెళ్లిపోయారు. దీంతో ఓపీ విభాగంలో ఎవరూ లేకపోవడమేంటని మంత్రి వైద్యులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా ఒంటి గంట వరకు ఓపీ పూర్తి చేసుకుని, ఒంటిగంట నుంచి మధ్యాహ్నం 2వరకు భోజన విరామం, ఆ తరువాత 2నుంచి మధ్యాహ్నం 4వరకు ప్రొఫెసర్ స్థాయి వైద్యాధికారులు అకాడమిక్‌కు అంటే వైద్యవిద్యార్థులకు బోధించేందుకు వెళ్తారు.
ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎంసీహెచ్ భవనంలోని ఐదోఅంతస్తులో ఉన్న ఐవీఎఫ్ కేంద్రాన్ని మంత్రి సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడున్న రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసిన మంత్రి ఐవీఎఫ్ ఇన్చార్జ్ గురించి కూడా ఆరాతీశారు. ఆ సమయంలో సదరు వైద్యులు అక్కడ లేకపోవడంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సదరు వైద్యురాలు లేబర్ రూమ్ నుంచి మంత్రి ఉన్న ఐదో అంతస్తులోకి వచ్చేందుకు యత్నించగా అక్కడున్న లిఫ్ట్‌ను మంత్రి కోసం నిలిపివేశారు. దీంతో చేసేది లేక సదరు వైద్యురాలు మెట్ల మార్గంలో వచ్చినా అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న మంత్రి సదరు వైద్యురాలు చెప్పేది వినకుండా, సీట్లో లేనందుకు షోకాజ్ నోటీసు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.