జగద్గిరిగుట్ట, డిసెంబర్ 6: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట రూ. లక్షలు వసూలు చేసిన ఓ మోసగాడు పారిపోయాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన మలిశెట్టి గోపీచంద్(28) హైదరాబాద్ ఆల్విన్‌కాలనీలో ఉంటున్నాడు. అదేకాలనీలో నివాసముంటున్న దూరపు బంధువు కిశోర్‌తో తనకు ఉద్యోగం వచ్చిందని నమ్మబలికాడు. జాబ్‌లో చేరేందుకు డబ్బులు కావాలని రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ తరువాత తమ కంపెనీలో డబ్బులు కడితే భారీ వేతనంతో జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు. ఉద్యోగం వేటలో ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని సూచించాడు.
ఆ తర్వాత సుమారు 15 మంది నుంచి రూ.లక్ష నుంచి నాలుగు లక్షల వరకు దాదాపు రూ.30 లక్షలు వసూలు చేశాడు. వారందరికీ ఆన్లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడంతోపాటు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాడు. ఉద్యోగంలో చేరేందుకు అతడు చెప్పినట్టు సోమాజిగూడలోని క్వాంట్ క్లౌడ్ కంపెనీకి వెళ్లి విచారించగా.. అది మూసివేసినట్టు తేలింది. డబ్బులిచ్చిన కొందరు గోపీచంద్‌ను నిలదీయగా.. హెచ్ఆర్ ఉద్యోగులు మోసం చేశారని.. మీ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాడు. ఇటీవల బాధితులు డబ్బు కోసం ఫోన్‌చేయగా.. స్పందించలేదు. బాధితులు ఆరా తీయగా.. అతడు పరారైనట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
రీల్స్ చూసి.. లింక్ క్లిక్ చేస్తే..
సిటీబ్యూరో: హస్తినాపురానికి చెందిన బాధితురాలు తన సెల్ఫోన్లో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ రకాల పోస్టులు, రీల్స్ చూస్తున్నది. ఇంతలో ఒక రిల్స్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడం వల్ల ప్రతి రోజు రూ. 6 వేల నుంచి రూ. 12 వేలు సంపాదించవచ్చంటూ ఉంది. వివరాల కోసం.. ఈ రీల్ క్లిక్ చేస్తే మరింత సమాచారం మీకు అందిస్తామంటూ నేరగాళ్లు నమ్మించారు. బాధితురాలు వాళ్లు చెప్పినట్లే ఆ రీల్‌ను క్లిక్ చేసింది. వెంటనే అది వాట్సాప్ నంబర్‌కు రీరూట్ అయ్యింది. వాట్సాప్‌లో.. గాయిత్రి నాయర్ పేరుతో ఒక చాట్ చేసింది. వెబ్సైట్లో పేరు, వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ సూచించింది. బాధితురాలు రూ. 300, రూ. 500 పెట్టుబడి పెట్టడంతో.. రూ. 88, రూ. 800 లాభాలు వచ్చాయి. సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు దఫ దఫాలుగా రూ. 3,64,777 పెట్టుబడిగా పెట్టింది. ఆ నగదును నేరగాళ్లు లాగేశారు. ఇదంతా మోసమని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.