Cyber Crime | సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ):‘మీతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీడియో కాల్లో మాట్లాడుతారు.. ఆయన వీడియో కాల్లోకి రాగానే లేచి నిల్చొని నమస్కారం చేయాలి.. ఆ తరువాత మీ కేసు విచారణ మొదలవుతుందం’టూ సైబర్‌నేరగాళ్లు ఫేక్ కోర్టును.. నకిలీ జడ్జీని తయారు చేసి.. కోర్టు ఆధ్వర్యంలో మీ ఖాతాలు అసెస్మెంట్ చేస్తామంటూ నమ్మి స్తూ వృద్ధుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ రిటైర్డు చీఫ్ సైంటిస్ట్‌ను అలాగే బురిడీ కొట్టించి.. డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.34 కోట్లు సైబర్‌నేరగాళ్లు కొట్టేశారు..
రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం..ఉప్పల్‌కు చెందిన రిటైర్డు చీఫ్ సైంటిస్ట్ ఉద్యోగికి గత నెల 31న ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీపై బెంగళూర్‌లోని అశోకనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందంటూ చెబుతూ అందుకు సంబంధించిన వివరాలు పోలీస్ అఫీసర్ సందీప్‌రావు వివరిస్తారంటూ ఫోనను మరొకరికి కనెక్ట్ చేశాడు. దీంతో తనకు తానుగా పోలీస్ అఫీసర్నంటూ చెప్పుకుంటూ సందీప్‌రావు ఫోన్లో మాట్లాడాడు..’మీ ఆధార్ నంబర్‌ను సదాకత్ ఖాన్ అనే వ్యక్తి దుర్వినియోగం చేశాడు, అతనిని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నవంబర్ 2, 2024న అరెస్ట్ చేశామన్నారు.
అతడిని విచారించిన సమయంలో కంబోడియా, మయన్మార్, పిలిపిన్స్కు సైబర్‌నేరాలు చేసేందుకు అక్రమంగా మనుషులను రవాణా చేస్తున్నట్లు వెల్లడయ్యింది.’ ఈ నేపథ్యంలో మీ ఆధార్ కార్డుకున్న లింక్‌పై సీబీఐ కూడా దర్యాప్తు చేస్తుందని వివరించాడు. ఇప్పటి వరకు మీపై అనుమానంతోనే కేసు దర్యాప్తు జరుపుతున్నామని, సుప్రీంకోర్టు కూడా ఈ కేసు విచారణను పరిశీలిస్తుందని, రేపు మిమల్ని సీబీఐ ఆ డాక్యుమెంట్లతో విచారిస్తుందంటూ ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటి తరువాత సీబీఐ అఫీస్ పేరుతో కొన్ని డాక్యుమెంట్లు పంపించారు, సుప్రీంకోర్టు లోగో, ఢిల్లీ, కర్ణాటక పోలీస్, సీబీఐ పోలీసుల విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ అంటూ ఫేక్ డాక్యుమెంట్లు వాట్సాప్ చేశారు.
అందులో అరెస్ట్ వారెంట్ కూడా జారీ కావడానికి సిద్ధంగా ఉన్న ఒక డాక్యుమెంట్ సైతం ఉంది. దానిని చూపించిన నకిలీ సీబీఐ అఫీసర్.. మీరు అరెస్ట్ నుంచి తప్పించకోవాలంటే.. మీకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, మనీ లాండరింగ్‌కు పాల్పడలేదని, ఇతర ప్రాంతాల నుంచి డబ్బురాలేదని రుజువు చేసుకోవాల్సి ఉంటుందని, అందుకు సుప్రీంకోర్టు రిజిస్టర్‌కు సంబంధించిన వివరాలు మేం ఇస్తాం..
అక్కడికి మీ బ్యాంకు వివరాలు పంపించండి , అవసరమైతే ఆర్టీజీఎస్ ద్వారా మీ ఖాతాలో ఉన్న డబ్బు సుప్రీంకోర్టు ఖాతాకు పంపించి, మీకు ఈ కేసుతో సంబంధం లేదని నిర్ధారణ అయిన తరువాత కోర్టు నుంచి నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు తిరిగి డిపాజిట్ చేయించుకోండంటూ సూచన చేశాడు. మీరు రేపు వీడియో కాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు మాట్లాడాల్సి ఉంటుందని, తెల్ల దుస్తులు వేసుకొని వీడియో కాల్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని, ఆయన చీఫ్ జస్టిస్ కావడంతో వీడియో కాల్లోకి రావడంతోనే మీరు పైకి లేచి నిల్చుని నమస్కారం చేయాలంటూ సూచించారు. అది నిజమని నమ్మిన బాధితుడు అతడి భార్య మరుసటి రోజు వీడియో కాల్ రావడంతోనే అప్రమత్తమయ్యాడు.
మీ ఖాతాలు అసెస్మెంట్ చేయాలి..!
సైబర్‌నేరగాళ్లు వీడియో కాల్లో జడ్జీలా మాట్లాడారు..‘మీపై తీవ్రమైన ఆరోపణలున్నాయి.. మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందం’టూ బెదిరించారు. అయితే మీరు అమాయకులు అయ్యేందుకు కూడా అవకాశముందని, పోలీసులు చెప్పేదీ ఏకపక్షంగా నమ్మం లేమంటూ మాట్లాడారు. ఇందుకు మీ బ్యాంకు ఖాతాలు అసిస్మెంట్ చేస్తే సరిపోతుందని, రెండు రోజులో ఈ అసెస్మెంట్ పూర్తిచేయాలని, సుప్రీంకోర్టు నేతృత్వంలో ఇది జరుగుతుందంటూ హామీ ఇచ్చాడు.
మీరు సుప్రీంకోర్టుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసే మొత్తం తిరిగి రిఫండ్ అవుతుందని భయపడాల్సిన పనిలేదంటూ భరోసా ఇచ్చారు. ఇది నిజమని నమ్మిన బాధితుడు తన మూడు ఖాతాల్లో ఉన్న రూ. 1.34కోట్ల డబ్బును ఈ నెల 2, 3వ తేదీల్లో సైబర్‌నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ చేశాడు. ఆ తరువాత ఎలాంటి ఫోన్లు రాకపోడంతో ఇదంతా మోసమని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.