సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు.. జడ్జిలను సృష్టించి.. కేసు నమోదైందని.. ఓ రిటైర్డ్ ఉద్యోగిని భయపెట్టి..డిజిటల్ అరెస్టు చేసి.. సైబర్ నేరస్తులు దోచుకున్న ఘటన ఇది. గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసముండే బాధితుడికి గత నెల 24న గుర్తుతెలియని వ్యక్తి తాను టెలీకమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి సందీప్రావును మాట్లాడుతున్నానంటూ ఫోన్ చేశాడు. ‘మీ ఫోన్ నంబర్ దుర్వినియోగం అయ్యింది. దీనికి సంబంధించిన బెంగళూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అందుకు సంబంధించి దయానాయక్ అనే పోలీసు అధికారితో మాట్లాడండం’టూ ఫోన్ నంబర్‌ను కనెక్ట్ చేశాడు. దయనాయక్ పేరుతో మాట్లాడిన నకిలీ పోలీసు అధికారి ‘మీ ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారు. దాని ద్వారా ఫోన్ నంబర్ తీసుకున్నారు.
సదాఖత్ ఖాన్ అనే వ్యక్తిని హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేశాం.. ఆయన కంబోడియా, మయన్మార్, ఫిలిపీన్స్ దేశాలకు అక్రమ పద్ధతిలో మనుషులను రవాణా చేస్తున్నాడు. ఆ కేసు విచారణలో మీ పేరు కూడా బయటకు రావడంతో సీబీఐ ఈ కేసును టేకప్ చేసింది.. నేను సీబీఐలో పనిచేసే పోలీస్ ఆఫీసర్‌ను’ అంటూ చెప్పుకొన్నాడు. అలాగే సుప్రీంకోర్టు పేరుతో తయారు చేసిన పలు నకిలీ పత్రాలు ఆయనకు పంపించారు.
‘మీరు అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే నేను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ వివరాలు మీకు అందిస్తాను.. ఆయనకు మీ బ్యాంకు ఖాతా తనిఖీ చేయమంటూ కోరండి..ఆయన అన్ని పరిశీలించి.. మీకు ఈ కేసుతో సంబంధం లేదని నిర్ధారించుకున్న తరువాత మిమ్మల్ని ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేస్తారం’టూ నమ్మించాడు. ‘మీతో సుప్రీంకోర్టు జడ్జి కూడా వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుతాడు.. ఆయన వచ్చినప్పుడు లేచి నిల్చొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని సూచనలు చేశాడు.
ఈ నేపథ్యంలో నకిలీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌తో మాట్లాడించారు. ఆ తరువాత సుప్రీంకోర్టు జడ్జి అంటూ వీడియో కాల్లో నకిలీ వ్యక్తులతో వీడియో కాల్ చేయించారు. ఆ వీడియో కాల్లో నకిలీ సుప్రీంకోర్టు జడ్జి బాధితుడితో మాట్లాడుతూ ‘మీ బ్యాంకు ఖాతాలన్నీ అసెస్మెంట్ కోసం వివరాలు ఇవ్వండి.. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు సుప్రీంకోర్టు అకౌంట్లోకి బదిలీ చేసి.. మీకు కేసుతో ఎలాంటి సంబంధం లేదని, బయట నుంచి మీ ఖాతాలోకి డబ్బు రాలేదని అసెస్మెంట్లో తేలిన తరువాత..మీ డబ్బు వాపస్ వస్తుందం’టూ సూచించారు.
అయితే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని సీబీఐ, బెంగళూర్ పోలీసులు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారని బెదిరించారు. నిజమైన సుప్రీంకోర్టు జడ్జి వీడియో కాల్లో చెప్పారని నమ్మిన బాధితుడు.. బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 38 లక్షలు పంపించాడు. ఆ తర్వాత తేరుకున్న బాధితుడు తెలిసిన వారి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో ఇదంతా ఫేక్ అని.. ఇదంతా సైబర్‌నేరగాళ్ల పని అంటూ చెప్పారు. దీంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.